CPI : ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం: సీపీఐ నారాయణ

by Ramesh Naini |

జి.రాంజీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే. నారాయణ ఆరోపించారు.

CPI : ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం: సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరును రద్దు చేసి, దాని స్థానంలో జి.రాంజీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే. నారాయణ ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త చట్టం తీసుకువచ్చి, ఖర్చులో 40 శాతం నిధులను రాష్ట్రాలే భరించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని, ఇది రాష్ట్రాలు భరించలేని భారమని నారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 28 లక్షల కోట్ల రూపాయలను సంపన్న కుటుంబాలకు పారుబకాయల పేరుతో ఖర్చు చేసి, పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ అనుకూల బిల్లులను బలవంతంగా ఆమోదింపజేస్తోందని తెలిపారు.

అంతర్జాతీయ పరిణామాలపై స్పందిస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని చంపుతానని బెదిరింపులు చేస్తుండటంతో పాటు, టారీఫ్‌ల పేరుతో భారాలను పెంచుతున్నాడని, అలాంటి ట్రంప్‌కు అనుకూలంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని డాక్టర్ నారాయణ విమర్శించారు. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన సంఘటన ట్రంప్‌‌కు షాక్‌గా మారిందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఇతర ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సీపీఐ నేతలు తెలిపారు.

Next Story