యముడు వదిలినా.. మేము వదలం : సజ్జనార్ వార్నింగ్

by Ramesh Naini |

మద్యం మత్తులో వాహనం నడిపే వారిపై హైదరాబాద్ పోలీసుల కఠిన వైఖరి కొనసాగుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.

యముడు వదిలినా.. మేము వదలం : సజ్జనార్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో వాహనం నడిపే వారిపై హైదరాబాద్ పోలీసుల కఠిన వైఖరి కొనసాగుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలను తప్పించుకునేందుకు సందుల్లోకి దూరి, ప్రమాదకర విన్యాసాలతో వాహనాలు నడపడం విజ్ఞత కాదని హెచ్చరించారు. ఈ నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు పోయేది ఎవరివో చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అది మీ ప్రాణమై ఉండొచ్చు లేదా ఎదుటివారి ప్రాణమై ఉండొచ్చని తెలిపారు. ఎవరు మరణించినా వారి కుటుంబాలకు మిగిలేది జీవితాంతం తీరని శోకమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమం కోసం పడే బాధను గుర్తుంచుకోవాలని, ఒక్క క్షణపు అజాగ్రత్తతో వారి జీవితాలను చీకట్లోకి నెట్టవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. మద్యం మత్తులో వాహనం నడపడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనని హెచ్చరించారు. ఒకవేళ యముడు క్షమించినా.. చట్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల ప్రాణాల విలువ పోలీసులకు తెలుసునని, అందుకే ఈ హెచ్చరిక చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ సందేశం విడుదల చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ట్వీట్ ఇదే..

Next Story