- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఒక్కో మినిస్టర్ ఒక్కో తీరు.. ఫలితంగా ఇరకాటంలో పార్టీ, ప్రభుత్వం
రాష్ట్రంలో పార్టీకి, కేడర్‌కు ఆదర్శంగా నిలవాల్సిన మంత్రుల్లో పలువురు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పార్టీకి, కేడర్‌కు ఆదర్శంగా నిలవాల్సిన మంత్రుల్లో పలువురు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన వారే అవి ఉత్పన్నమయ్యేందుకు కారణమవుతున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర యంత్రాంగాన్ని తమ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన మంత్రులు సహచర మినిస్టర్లపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా పార్టీతో పాటు ప్రభుత్వం సైతం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. మరోవైపు ప్రజల్లోనూ చులకన అవుతున్నారు. ఫలితంగా కేడర్, నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలోని ప్రతి విషయాన్ని ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. మంత్రులుగా ఉన్న నేతలు పెద్దరికంతో వ్యవహరించి సమస్యలను సీఎం, పీసీసీ అధ్యక్షుడు వద్దకు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. అక్కడ పరిష్కారం దొరక్కపోతే ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలి. కానీ ప్రస్తుతం పలువురు మంత్రులు రివర్స్ గేర్‌లో వెళ్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన విషయాలను మీడియా ముందు, సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారని టాక్. ఫలితంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారనే విమర్శలున్నాయి. ఇలా వివాదాలను గుర్తించిన పార్టీ ముఖ్య నాయకులు వాటిని పరిష్కరించేలోపే ఎంతో కొంత నష్టం వాటిల్లుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలకు కేంద్ర బిందువుగా..
ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమం వివాదానికి వేదికైంది. మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేశారనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. విషయం సీఎం వరకు వెళ్లింది. పొన్నం, అడ్లూరి మధ్య వివాదాన్ని పరిష్కరించాలని పీసీసీ చీఫ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఇరువురు మంత్రులతో భేటీ అయిన పీసీసీ చీఫ్ వారికి సర్ది చెప్పారు. వివాదం అంతటితో ముగిసింది. కానీ, తాజాగా నిజామాబాద్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశిస్తూ మినిస్టర్ వివేక్ కామెంట్స్ చేశారు. దీనికి మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. ఇలా ఈ వివాదం మాటల యుద్ధానికి దారి తీశాయి. ఇరువురి మధ్య వివాదం కులాలు, ఉపకులాల వారీగా విడిపోయి విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మళ్లీ పార్టీ పెద్దలు ఎంటర్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
తన శాఖలో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ..
మేడారం జాతర పనులకు సంబంధించిన వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని మినిస్టర్ కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. మేడారం జాతర పనులను పర్యవేక్షించే బాధ్యతను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అప్పగిస్తున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పొంగులేటి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పనులపై పొంగులేటి పలుమార్లు సమీక్షించారని, సోమవారం సైతం మేడారంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. మరోవైపు మేడారం జాతర పనులపై తాను ఎవ్వరికి ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ దంపతులపై చేసిన ఫిర్యాదులో ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి హస్తం ఉందని కొండా వర్గీయులు ఆరోపించారు. తర్వాత వివాదం ముగిసింది. తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
సఖ్యత లేదనే ఆరోపణలు..
ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో అతి స్వేచ్ఛ సైతం ఒక్కోసారి కొత్త సమస్యలకు దారి తీస్తుందంటూ అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రతిపక్షం ఆయుధంగా మార్చుకునే అవకాశముందని, అధికార పార్టీపై వ్యతిరేక ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వివాదాలు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తాయని, అధికారపార్టీలోనే విభేదాలు ఉన్నట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతే భవిష్యత్‌లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌పార్టీలో మంత్రి పదవి దొరకడం అంత సులువైన విషయం కాదని, రాజకీయంగా వచ్చిన అరుదైన అవకాశాలను కొందరు సద్వినియోగం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.






