ఎస్సీ అభివృద్ధి శాఖలో 1,392 పోస్టుల కొనసాగింపు ఉత్తర్వులు.. మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 1,392 పోస్టులకు ఒక సంవత్సరం పాటు సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖలో 1,392 పోస్టుల కొనసాగింపు ఉత్తర్వులు.. మంత్రి అడ్లూరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : (Social Welfare Department) షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 1,392 పోస్టులకు ఒక సంవత్సరం పాటు (01.04.2025 నుంచి 31.03.2026 వరకు) సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని హాస్టళ్లు, ప్రీ–మెట్రిక్, పోస్ట్–మెట్రిక్ వసతిగృహాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, జిల్లా కార్యాలయాల్లో సేవలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల శ్రేయస్సు, భవిష్యత్తు నిర్మాణం కోసం, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని సోమవారం హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో హాస్టళ్లలో సిబ్బంది లోటు భర్తీ కావడంతో పాటు విద్యార్థుల వసతి, ఆహారం, విద్య, భద్రత అన్ని రంగాల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నాయని మంత్రి లక్ష్మణ్​కుమార్​చెప్పారు. తమ ప్రభుత్వ లక్ష్యం ప్రతి ఎస్సీ విద్యార్థి మంచి వాతావరణంలో చదువుకోవాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఈ పోస్టుల కొనసాగింపు ద్వారా ఆ దిశగా మరో ముందడుగు పడిందన్నారు. ఈ ఉత్వర్వుల ద్వారా మొత్తం 1,392 పోస్టుల్లో 11 కాంట్రాక్టు, 197 పార్ట్‌టైం, 1,184 అవుట్‌సోర్సింగ్ సేవలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్ని పోస్టులు ఎస్సీ అభివృద్ధి కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన సిబ్బంది అందుబాటులోకి రానున్నట్లు వారు వివరించారు.

Next Story