తెలంగాణలో SIR.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ వినతిపత్రం

by Prasad Jukanti |   (  Updated:2026-05-15 09:03:10  IST  )

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ లీడర్లు కలిశారు. .

తెలంగాణలో SIR.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ వినతిపత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ల జోరీ జరిగిందని బెంగాల్ ఎన్నికలే నిదర్శనం అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవని ఎస్ఐఆర్ ప్రక్రియ ఏడాది పొడవున చేయాలని డిమాండ్ చేశారు. బీఎల్‍ఓలు 3 సార్లు వెరిఫికేషన్ చేయాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగే సర్ ప్రక్రియపై ఎస్ఈసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. సర్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని కోరినట్లు తెలిపారు.

ఎస్ఈసీకి వినతిపత్రం:

ఈ సందర్భంగా ఎస్ఐఆర్‍పై కొన్ని ఆందోళనకరమైన విషయాలు, సూచనలు లిఖితపూర్వకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అందజేశారు.

-సమయం - ప్రణాళిక: గత 25 ఏళ్లలో ఓటర్ల సంఖ్య 1.2 కోట్లు పెరిగినందున, తొందరపాటు లేకుండా ఈ ప్రక్రియను 1.5 నుండి 2 ఏళ్ల పాటు దశలవారీగా నిర్వహించాలి.

-సిబ్బందికి ఒకే బాధ్యత: జనాభా గణన, SIR విధులు వేర్వేరుగా ఉండాలి. ఒకే అధికారికి రెండు బాధ్యతలు అప్పగించకూడదు.

-జాబితాల సరఫరా: గుర్తింపు పొందిన పార్టీలకు 2002, 2025 నాటి ఓటర్ల జాబితాల సాఫ్ట్ (OCR/Excel) మరియు హార్డ్ కాపీలను అందించాలి.

-నోటీసులు - గడువు: అభ్యంతరాలకు, నోటీసుల ప్రతిస్పందనకు కనీసం ఒక నెల గడువు ఇవ్వాలి. ఓటు తొలగించే ముందు 7 రోజుల ముందస్తు వ్రాతపూర్వక నోటీసు తప్పనిసరి.

-BLO క్షేత్రస్థాయి పరిశీలన: బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) జియో-ట్యాగ్ ఫోటోలతో కనీసం 3 సార్లు గృహ సందర్శన చేయాలి. సాఫ్ట్‌వేర్ తప్పుల ఆధారంగా కాకుండా భౌతిక ధృవీకరణ తర్వాతే మార్పులు చేయాలి.

-BLA నియామకం - శిక్షణ: ధృవీకరణకు ముందే అన్ని బూత్‌లలో తాజా 'బూత్ లెవల్ ఏజెంట్ల' (BLA) నియామకం పూర్తి చేసి, వారికి శిక్షణ ఇవ్వాలి.

-దుర్వినియోగం - అక్రమాల నివారణ: ఫారమ్-7 ద్వారా ఓట్ల బల్క్ తొలగింపులను కఠినంగా నివారించాలి. ASD (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్) జాబితాలను రాజకీయ పార్టీలకు సకాలంలో ఇవ్వాలి.

-డేటా భద్రత: SIR ప్రక్రియకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ERO, DEO స్థాయిల్లో 5 ఏళ్ల పాటు భద్రపరచాలి.

-బలహీన వర్గాల రక్షణ: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేద వర్గాల ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలి.

-వలసదారులకు సడలింపు: 2002 తర్వాత తెలంగాణకు వలస వచ్చి, కనీసం రెండు ఎన్నికల్లో ఓటు వేసిన వారికి అఫిడవిట్ ఆధారంగా ఓటు హక్కు కల్పించాలి.

-అధికారుల జవాబుదారీతనం: నిబంధనలు ఉల్లంఘించి, నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలగించే అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

Next Story