ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ఆరాటం: బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో నితిన్ నబీన్

by Kema Shiva Kumar |

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ అన్నారు.

ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ ఆరాటం: బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో నితిన్ నబీన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ (Nitin Nabeen) అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్‌ (Mahbubnagar)లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరులకు తాను శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ ప్రసంగాన్ని ఆరంభించారు. తెలంగాణ ఉద్యమంలో అలసట ఎరుగకుండా పోరాడిన వీరులకు నమస్కరిస్తున్నానని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ ఎదురొడ్డి పోరాడిందని కొనియాడారు.

వక్ఫ్ బోర్డులను బలోపేతం చేసేందుకు యత్నం..

హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని పేర్కొన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని కామెంట్ చేశారు. కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలనలో బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో కూడా ప్రభుత్వం భారీగా కోత విధిస్తోందని అన్నారు.

కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి...

పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపట్లేదని.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోమని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో అన్నింటా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతుభరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని.. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించాలని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. ఈ అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలని నితిన్ నబీన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story