బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది

by Elthuri vijay kumar |

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది
X

బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది

మమ్మల్ని అణచివేయాలని చూస్తే ఊరుకోం

వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన తీన్మార్ మల్లన్న

దిశ, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కామారెడ్డి డిక్లరేషన్ పట్టించుకోలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హన్మకొండలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. పది అంశాలను ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు.ప్రొపెసర్ జయశంకర్ సార్ ను జాతిపితగా గుర్తించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని రెండో అంశంగా పెట్టుకున్నామన్నారు. బీసీలకు ప్రతి సంవత్సరం లక్ష కోట్లు బడ్జెట్ గా పెట్టాలని కామన్ మినిమంలో పెట్టామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి కనీసం రెండువేల కోట్లు పెట్టలేదన్నారు. బీసీలను మోసం చేశారన్నారు. బీసీలలో భూమిలేని కుటుంబాలు 16 లక్షల ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే రెండు ఎకరాలు ఇస్తామన్నారు.

మేము ఎవ్వరికి శత్రువులం కాదన్నారు. మా పార్టీలో అందరికి స్థానం ఇస్తామన్నారు. అగ్రవర్ణ పేదలను ఆదుకుంటామని, వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. సచార్ కమిటీ ఆధారంగా ముస్లీంల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని, మహిళకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వరంగల్ ను రెండో రాజధానిగా తాము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ 26 అంశాలు ప్రకటించి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను, బీసీ ఉద్యోగులను అణచివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తామన్నారు.

Next Story