అంబేద్కర్‌పై కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.. బండి సంజయ్

by Kema Shiva Kumar |

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

అంబేద్కర్‌పై కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.. బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కుట్రలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుభమంగళ గార్డెన్స్‌లో నిర్వహించిన ‌సెమినార్‌ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా మార్చుకుంటూ తన చదువుతో సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.

చిన్న సమస్య, అవమానాలు ఎదురైతే లక్ష్య సాధన నుంచి పక్కకు తప్పుకుంటున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితమే స్పూర్తిదాయకమని కొనియాడారు. ఆయనను ఒక్క దళిత జాతికే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని కామెంట్ చేశారు. మహనీయుడు అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా.. ఎన్నికల్లో ఓడించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. ఆయన చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పిన నీచమైన చరిత్ర హస్తం పార్టీదని అన్నారు. డెడ్‌బాడీని ముంబైకి పంపి విమాన ఛార్జీలు చెల్లించాలని బిల్లు పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసేందుకు ఆ పార్టీలు కుట్రలు చేసిందని ఆరోపించారు. ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇవ్వకుండా ఆయనను ఓడించిన కజ్రోల్కర్‌కు పద్మభూషణ్ అవార్డును కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు.

దేశం ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలువేనని అన్నారు. దళిత, బడుగు, బలహీనవర్గాల బిడ్డలంతా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారంటే ఆయనే కారణమని కొనియాడారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు సహా ఉన్నత పదవుల్లో దళిత, బహుజన బిడ్డలు కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షేనని అన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను తక్కువ చేసిందని అన్నారు. ఆర్టికల్ 370 దేశానికి మంచిది కాదని, ఒకే దేశానికి రెండు చట్టాలు కరెక్ట్ కాదన్న అంబేద్కర్‌ను అవమానిస్తూ ఆ ఆర్టికల్‌ను ఆమోదించారని ఫైర్ అయ్యారు. బీసీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందని ఆరోపించారు.

మైనారిటీ సంతూష్టీకరణ కోసం మైనారిటీ విద్యా సంస్థలకు అనేక మినహాయింపులిచ్చిందని గుర్తు చేశారు. మైనారిటీ విద్యా సంస్థల్లో అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిషేధించిందని అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు వచ్చేలా చేసిన పార్టీ బీజేపీయేనని అన్నారు. అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120 దేశాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించామని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టామని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశామని తెలిపారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించామని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్ రెడ్డి, సోమిడి వేణు పాల్గొన్నారు.

Next Story