కాగ్ నివేదికతో కాంగ్రెస్ సర్కార్ బండారం బయటపడింది: పాయల శంకర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకోబోదని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తుందని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్ ​పేర్కొన్నారు.

కాగ్ నివేదికతో కాంగ్రెస్ సర్కార్ బండారం బయటపడింది: పాయల శంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకోబోదని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తుందని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్ ​పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని, కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలు అంటే ప్రజల సమస్యలు చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన వేదిక అని, ఆ ఆశలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరగాలని డిమాండ్ చేసేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను పూర్తిగా మర్చిపోయి కేవలం 10 రోజుల్లోనే సమావేశాలు ముగించడం బాధాకరం అని ఆవేదన చెందారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తాము అనేక సమస్యలను శాసనసభలో ప్రస్తావించడానికి ప్రయత్నించినప్పటికీ, మా గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు వస్తే సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రులు ఎగతాళి చేయడం, ఎదురుదాడి చేయడం దురదృష్టకరమన్నారు. జాతీయ గీతం, వందేమాతరంను అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని ప్యానల్ స్పీకర్‌గా నియమించడం దేశానికి అవమానకరమని ఆరోపించారు. కాగ్ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని స్పష్టంగా వెల్లడైందన్నారు.

గత బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లు..

గత బడ్జెట్‌లో ప్రకటించిన రూ.60 వేల కోట్లను కూడా ఖర్చు చేయలేకపోయారని కాగ్ చూపించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో 53 వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్‌ ఉంటే 2014 నుండి దీనిపై సర్వేలు నిర్వహించలేదని చెప్పినా కాగ్ హెచ్చరికలను పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిందని మండిపడ్డారు. తెలంగాణను జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టి, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి నిధులు తరలించడం జరుగుతోంది. కేరళంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులే పెద్ద ఎత్తున ఇంచార్జ్‌లుగా వ్యవహరించడం, ఈ నిధుల వినియోగంపై అనుమానాలను మరింత పెంచుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లక్షల కోట్ల అవినీతి బయటపెడతామని, విదేశాలకు దాచిన సొమ్మంతా రాష్ట్రానికి తీసుకొచ్చి, తద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడది మర్చిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణ చేయకుండా వ్యవహరిస్తోంది.. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీని ఇక్కడి బీఆర్ఎస్ పార్టీ అప్రోచ్ అయిందని, అందుకే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ మాత్రం ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.

Next Story