- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపడిందా?.. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సమాజంలోని అసమానతలు, రుగ్మతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించేందుకు పాటుపడిన వారు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు వద్దని కులవృత్తులు చేసుకోవాలని మాత్రమే గత పాలకులు భావించారని అందుకే దళితులు చెప్పులు కుట్టుకోవాలని, బలహీన వర్గాలు చేపలు పట్టాలని, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలంటూ పథకాలు తెచ్చారు తప్ప మీకు చదువులు చెప్పిస్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీకు రాజ్యనిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని ద్వజమెత్తారు. మాజీ సీఎం తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరొచోట పదవులు ఇచ్చుకున్నారు గానీ రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పీజీలు చేసిన యువకులు జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోయారన్నారు. ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ఇవాళ బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో సీఎం బహుమతులు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో గత పాలకులపై సీఎం విమర్శలు గుప్పించారు.
నోటికాడికి వచ్చిన ముద్ద లాగేసే కుట్ర:
దాదాపు రూ. 25 వేల కోట్లు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతుంటే ఇంత వెచ్చించి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందా అని ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక రాసిందని సీఎం అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని అధికారంలోకి వచ్చిన తొలియేడాదిలోనే ఇన్ని ఉద్యోగులు ఇచ్చిన ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వమైనా ఉంటే వారు విధించే ఏ శిక్షకైనా నేను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిద్ధం అని చాలెంజ్ చేశారు. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. ఉద్యోగాల భర్తీ త్వరగా పూర్తయితే ఉద్యోగం రానివారు మరో పని చూసుకుంటారన్నారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని, గత ప్రభుత్వంలో గ్రూప్ -1 పరీక్షలు పెట్టి వాటి ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బఠాణిళ్లా అమ్ముకుని వారికి కావాల్సిన వారినే పాస్ చేయించుకున్నారని ఆరోపించారు. అలాంటి వారిని అరెస్టు చేసి ఆ పరీక్షలను రద్దు చేసి కొత్త పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షలు, ఫలితాలు వెలువరించి నియామక పత్రాలు ఇద్దామనుకున్న సమయంలో కోర్టుల్లో రాజకీయ కేసులు వేసి ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్లుగా కేసులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తుంటే గతంలో పదేళ్లు పరీక్షలు నిర్వహిచని పార్టీలో ఇవాళ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. ఉద్యోగాలకు అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లో ఈ ఏడాది లక్ష ఉద్యోగాలు ఇచ్చాం.అయినా ఇవి సరిపోదన్నారు.
సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపడలేదు:
గత పదేళ్లు ముఖ్యమంత్రి ఎవరిని కలవలేదు. కానీ నేను అనునిత్యం మీకు అందుబాటులోనే ఉంటున్నాను. ఇది ప్రజాపాలనకు, దొరల పాలనకు ఇది తేడా అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఆకాశం నుంచి ఊడిపడిన పదవి కాదు. అది అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించి ఇస్తే ఈ పదవి వస్తుందన్నారు. అందుకే మీ మధ్యలో ఉండి మీతో ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నన్నారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించేందుకు పాటుపడిన వారు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని అలాంటి వారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఏర్పడిందని సీఎం చెప్పారు. పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తుంటున్నామన్నారు. చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని చదువు మాత్రమేనన్నారు. బాగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు చదువు ఒక్కటై ఏకైక లక్ష్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విడివిడిగా రెసిడెన్షియ్ స్కూల్స్ పెట్టడం ద్వారా విద్యార్థులలో ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందన్నారు. దీనిపై ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశానికే ఆదర్శంగా ఉండేలా యంగ్ ఇండియా ఇండిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం తీసుకువచ్చామన్నారు. గతంలో ఎన్నడూ రాని అవాకాశాలను దళితులకు ఈ ప్రభుత్వ కల్పించిందన్నారు.






