బీజేపీ చేతిలో ‘గులాబీ’ భవిష్యత్.. అస్త్రంగా మల్చుకుంటారా? నిందలు మోస్తారా?

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజం నిగ్గుతేల్చాల్సిన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

బీజేపీ చేతిలో ‘గులాబీ’ భవిష్యత్.. అస్త్రంగా మల్చుకుంటారా? నిందలు మోస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజం నిగ్గుతేల్చాల్సిన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ అంశం బీజేపీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఈ కేసును సీబీఐ త్వరితగతిన విచారించి దోషులను శిక్షిస్తే కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశముంది. అలా కాకుండా సాగదీస్తూ విచారణను నీరుగారిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. ఫలితంగా అది కమలం పార్టీ భవిష్యత్‌కు మచ్చగా మారే చాన్స్ ఉన్నది. విచారణ టైంలో సీబీఐ దూకుడు ప్రదర్శించకపోతే ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతున్నదని సమయం వచ్చినప్పుడల్లా హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి టైంలో విచారణలో పురోగతి లేకపోతే గులాబీ పార్టీ లీడర్లను బీజేపీ రక్షించే ప్రయత్నాలు చేస్తుందంటూ ఎటాక్ చేసే అవకాశముంది.

బీజేపీ చేతిలో ‘గులాబీ’ భవిష్యత్

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యల కోసం సిట్ లేదా సీఐడీకి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అలా చేస్తే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి విచారణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ లీడర్ల భవిష్యత్ కేంద్రం చేతుల్లో ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ విచారణ ప్రక్రియలో ఆలస్యం జరిగినా, చర్యలు తీసుకోకపోయినా గులాబీ లీడర్లను కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆరోపణలు రావొచ్చు. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చలు జరిగాయని ఇటీవలే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత స్వయంగా బయటపెట్టారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం పలు ఆరోపణలు చేశారు.

అస్త్రంగా మల్చుకుంటారా? నిందలు మోస్తారా?

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందని కాంగ్రెస్ లీడర్లు చేస్తున్న ఆరోపణలను బీజేపీ మొదటి నుంచీ తిప్పికొడుతున్నది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై విచారించేందుకు అధికార పార్టీ వెనుకంజ వేస్తుందని కమలం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతవరకు బీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోలేదని అధికార పార్టీని కార్నర్ చేశారు. అదే కేసును సీబీఐకి అప్పగిస్తే వెంటనే విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్న కమలం నేతలు విచారణలో తమ సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా పట్టుసాధించేందుకు బీజేపీకి ఈ కేసు పరోక్షంగా ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతున్నది. విచారణ త్వరగా పూర్తి చేసి బాధ్యలపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కాస్త వీక్ అయ్యే చాన్స్ ఉంది. అది పరోక్షంగా కమలం పార్టీకి కలిసి వస్తుందని పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.

Next Story