కేరళ ఎన్నికల్లో తెలంగాణ గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం: కిషన్ రెడ్డి

by Ramesh Naini |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం పూర్తిగా అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేరళ ఎన్నికల్లో తెలంగాణ గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం పూర్తిగా అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘ఆరు గ్యారెంటీలు తెలంగాణలో పూర్తిగా విఫలమయ్యాయి. ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కాలేదు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్లు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇది సాధారణ అబద్ధం కాదు, ప్రజలను మోసం చేసే ప్రయత్నంగా ఉంది. కాంగ్రెస్ మాటలు నమ్మవద్దు, ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళ ప్రజలను మోసం చేశాయి. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి మాటలకు కేరళంలో విలువ లేదు. ఆయన ఎందుకు అక్కడికి వెళ్లారో అందరికీ తెలుసు. తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ నాయకులను అక్కడ పిలుస్తున్నారు. ఉపన్యాసాలు ఇవ్వమని పిలుస్తున్నారు కానీ ఓట్లు మాత్రం పడవు’ అని ఆయన విమర్శించారు.

బీఆర్ఎస్​ నేత హరీశ్‌రావు 2014కు ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం ముంపు ప్రాంతాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో ఉన్న అంశాలు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో జరిగాయి. దీనికి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం విషయంలో తాము పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మేడిగడ్డ కానీ కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు మొత్తంగా సీబీఐ విచారణకు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది, పూర్తి నిజాలు బయటకు రావాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని, లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా చర్యలు తీసుకోలేదు’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Next Story