వైద్యుల బదిలీలపై మళ్లీ గందరగోళం.. జీవో-38 అమలుపై టీజీజీడీఏ ఆందోళన

by Ramesh Naini |

వైద్య ఆరోగ్య శాఖలో సాగుతున్న బదిలీల ప్రక్రియలో జాప్యం, జీవో నెం.38కు విరుద్ధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాలపై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) తీవ్రంగా మండిపడింది.

వైద్యుల బదిలీలపై మళ్లీ గందరగోళం.. జీవో-38 అమలుపై టీజీజీడీఏ ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలో సాగుతున్న బదిలీల ప్రక్రియలో జాప్యం, జీవో నెం.38కు విరుద్ధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాలపై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) తీవ్రంగా మండిపడింది. బదిలీల విధివిధానాలు ఆలస్యం చేయడంపై అధికారుల తీరును నిరసిస్తూ గురువారం హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. నరహరి, సెక్రటరీ జనరల్ డా. లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డా. రౌఫుద్దీన్ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన జీవో నం.38 ప్రకారమే ఎటువంటి మార్పులు, వక్రీకరణలు లేకుండా బదిలీలు నిర్వహించాలని డా. నరహరి డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఫోకల్, నాన్ ఫోకల్ ప్రాంతాల నిర్వచనాలను మార్చే ప్రయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల్లో తీవ్ర అసంతృప్తి, అనుమానాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత నుంచి కొనసాగుతున్న ఏకైక గుర్తింపు పొందిన డాక్టర్ల సంఘం తమదేనని తెలిపారు. ఫోకల్- నాన్ ఫోకల్ అంశం తేనె తుట్టె వంటిదని, దాన్ని అనవసరంగా కదిలించకూడదని స్పష్టం చేశారు.

జీవో వచ్చి నెల రోజులు దాటినా బదిలీల విధివిధానాలను విడుదల చేయకపోవడంపై డా. లాలూ ప్రసాద్ రాథోడ్ మండిపడ్డారు. కొందరు అధికారుల తీరు వల్ల గందరగోళం చోటుచేసుకుంటోందని ఆయన విమర్శించారు. ఆన్‌లైన్ కౌన్సిలింగ్ వల్ల ఇబ్బందులు వస్తాయని, అందుకే ఆఫ్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీజీజీడీఏకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆంధ్రాకు చెందిన డీఎంఈ, అకడమిక్ డీఎంఈలు తెలంగాణ వైద్యుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని డా. రమేష్ ఆరోపించారు. అడిషనల్ డీఎంఈ స్థాయి అధికారులను సైతం తక్కువ కేడర్‌లో పనిచేయిస్తున్నారని తెలిపారు. తమకు, తమ యూనియన్ కు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన చరిత్ర ఉందని.. ఈ విషయాన్ని హెచ్ఓడీలు, ప్రభుత్వం గుర్తుంచుకోవాలని డా. పల్లం ప్రవీణ్ హెచ్చరించారు. అనంతరం డీహెచ్ కు వినతిపత్రం అందించారు. డీఎంఈ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చారు.

టీజీజీడీఏ ముఖ్య డిమాండ్లు..

* రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లకు కనీసం 2 సంవత్సరాల అర్హత కాలపరిమితిని అమలు చేయాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులను, సదరు వైద్యుడు స్వయంగా కోరితే తప్ప లేదా మరొక వైద్యుడు ఆ పోస్టును స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బలవంతంగా మాండేటరీ షిఫ్టింగ్ చేయకూడదు.

* బదిలీల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఆఫ్‌లైన్, ఫిజికల్ కౌన్సెలింగ్ మాత్రమే చేపట్టాలి.

* డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనరేట్ స్థాయిలో జరుగుతున్న ఆలస్యం, సమన్వయ లోపాలను వెంటనే సరిచేసుకుని వెంటనే స్పష్టతతో, పారదర్శకంగా, జీవో నం.38 ప్రకారం బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి.

Next Story