‘వాళ్లను చూస్తే మీకు మీ తల్లిదండ్రులే గుర్తు రావాలి’.. గ్రూపు-2 అభ్యర్థులకు సీఎం స్వీట్ వార్నింగ్

by Gantepaka Srikanth |

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులందరిపైనా ఉందని, అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

‘వాళ్లను చూస్తే మీకు మీ తల్లిదండ్రులే గుర్తు రావాలి’.. గ్రూపు-2 అభ్యర్థులకు సీఎం స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులందరిపైనా ఉందని, అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పిలుపునిచ్చారు. శనివారం శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సలహాదారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.

దీపావళి పండుగ శుభవేళ ఉద్యోగ నియామక పత్రాలను అందుకుంటున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలను నిర్ధేశించామని గుర్తుచేస్తూ, గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. “మనిషి జీవితంలో జన్మదినం ఎంత ముఖ్యం, ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు. ఈరోజు అందుకోబోయే నియామక పత్రం జీవితంలో ఒక భావోద్వేగం. ఈరోజు నుంచి మీరంతా బాధ్యత కలిగిన అధికారులు. ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కాపాడుకుంటూ ముందుకు సాగాలి.

ప్రభుత్వ అధికారులుగా ఉద్యోగంలో చేరడానికి తమ రక్తాన్ని చమటగా మార్చి మిమ్మల్ని భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత. ఈరోజు నుంచి అధికారులుగా మీవద్దకు వచ్చే ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందించాలి. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యతగా విధులు నిర్వర్తించాలి. ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చట్టం చేయబోతున్నాం. ముందుగానే గ్రూప్-2 ఫలితాలు వెల్లడించినట్టయితే ఎంపికైన అభ్యర్థులు తిరిగి గ్రూప్-1 లో కూడా సెలెక్షన్ వస్తే అందులోకి వెళ్లినప్పుడు గ్రూప్-2 ఖాళీల్లో కొందరు అభ్యర్థులు అవకాశాలు కోల్పోతారని భావించి ముందుగా గ్రూప్-1 ఫలితాలు విడుదల చేశారు. అదే క్రమంలో గ్రూప్ -3 ఆ తర్వాత గ్రూప్-4 ఫలితాలను కూడా వెల్లడిస్తారు.

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. అలాగే, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన పూర్తి చేశాం” అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఉద్బోధించారు.

Next Story