రానున్న రోజుల్లో 10 రాష్ట్రాల్లో సింగరేణి కార్యకలాపాలు: సీఎండీ ఎన్.బలరామ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా సింగరేణిని విస్తరించే ప్రణాళిక సిద్ధం చేశామని సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో 10 రాష్ట్రాల్లో సింగరేణి కార్యకలాపాలు: సీఎండీ ఎన్.బలరామ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరమని సజ్జనార్ తెలిపారు. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయని, కాబట్టి వ్యవస్థను పటిష్టపరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తేవాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మార్పులను స్వీకరించడంలో వెనుకబడ్డ అనేక కంపెనీలు మూతపడ్డాయని గుర్తుచేసి, సింగరేణి ఉద్యోగులు సవాళ్లను స్వీకరించి, తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. విజిలెన్స్ విభాగం ఇతర సంస్థల్లో అమలు చేస్తున్న మంచి పద్ధతులను స్వీకరించడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

విదేశాలకు సైతం విస్తరిస్తాం..

రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా (Singareni) సింగరేణిని విస్తరించే ప్రణాళిక సిద్ధం చేశామని సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. సింగరేణి చేపడుతున్న వ్యాపార విస్తరణ వివరాలను ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story