- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Singareni: ఇకపై రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. ఏరియా జీఎంలకు సీఎండీ కీలక ఆదేశాలు
సింగరేణి ప్రతి విభాగం వారు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి ప్రతి విభాగం వారు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని.. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని సీఎండీ ఎన్.బలరామ్ (CMD Balaram) ఆదేశించారు. మంగళవారం సింగరేణి భవన్ (Singareni Bhavan) నుంచి అన్ని ఏరియాల జీఎంలతో ఆయన (Coal production) బొగ్గు ఉత్పత్తి, నూతన ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు రంగంలో పోటీని ఎదుర్కోవడానికి నాణ్యత పెంపు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా అన్ని ఏరియాల్లోనూ దుబారాను నివారించి పొదుపు పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్పత్తికి విఘాతం కలిగిందని, జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, ప్రస్తుత లక్ష్యాలను సాధించడానికి ఇకపై రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.10 లక్షల బొగ్గు రవాణా సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. రోజుకు 12.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలన్నారు. వర్షాకాలం ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తి పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. యంత్రాల వినియోగాన్ని పెంచాలని, ప్రతీ ఒక్క ఉద్యోగికి కేటాయించిన 8 గంటల షిఫ్ట్ సమయాన్ని కంపెనీ ఉత్పాదకతకు వినియోగించేలా చూడాలన్నారు. కొత్త ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
సింగరేణి ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ ఎస్టేట్స్ విభాగం అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, రికార్డులను ఆన్‌లైన్ చేయాలన్నారు. ఈ ఏడాది ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అనుమతులు వెంటనే సాధించాలన్నారు. కొత్తగూడెంలో వీకే కోల్ మైన్, ఇల్లందులో జేకే ఓసీ గనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభించదలచుకున్న మూడు గనుల వల్ల 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అలాగే వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్న గనుల వల్ల మరో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వీటి అనుమతుల పురోగతిపై రోజు వారీగా సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం.తిరుమలరావు, ఈడీ కోల్ మూమెంట్ బి.వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్), టి.శ్రీనివాస్, జీఎం(సీపీపీ) ఎ.మనోహర్, కార్పొరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.






