- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు నెలల్లో మూడోసారి.. పాలమూరుపై సీఎం రేవంత్ 'స్పెషల్ ఫోకస్'
ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ధ్యేయంగా ఆయన రెండు నెలల వ్యవధిలో మూడోసారి బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ధ్యేయంగా ఆయన రెండు నెలల వ్యవధిలో మూడోసారి బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన రానున్నారు. జిల్లాలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామికాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన సాగనుంది.
ప్లాంట్, పాఠశాల భవనాల ప్రారంభోత్సవం
ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని దివిటిపల్లి వద్ద ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న అమరరాజా కంపెనీలో నూతన సెల్స్ ఉత్పత్తి (కస్టమర్ క్వాలిఫికేషన్) కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తకోటలో స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ఆధ్వర్యంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాల నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులకు అంకితం చేయనున్నారు.
విద్య, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జిల్లాకు వచ్చిన మొదటిసారి సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించి వాటిని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండవసారి మిడ్జిల్ మండల పర్యటన సందర్భంగా జిల్లా సమగ్రాభివృద్ధిపై స్పష్టతనిచ్చారు. ఈ మూడో పర్యటనలో విద్యావ్యవస్థపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు త్రిబుల్ ఐటీ, ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా నమూనా పాఠశాలలను ప్రకటించిన ఆయన, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు మరిన్ని మెరుగైన విద్యాసంస్థల మంజూరుపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అలాగే అదనపు పరిశ్రమల ఏర్పాటు, వృత్తి శిక్షణ, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఐటీ టవర్ పై నిరుద్యోగుల ఆశలు!
మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లి వద్ద ఇంజనీరింగ్ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన ఐటీ టవర్ ప్రస్తుతం నాన్-ఐటీ కంపెనీలమయంగా మారిందనే ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం నాలుగు అంతస్తుల (ఫ్లోర్స్) భవనంలో ఒక ఫ్లోర్ ఖాళీగా ఉండగా, మిగిలిన మూడు ఫ్లోర్లలో నాన్-ఐటీ కంపెనీలే తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. జిల్లాకు చెందిన నిరుద్యోగ ఐటీ యువతకు న్యాయం జరగాలంటే ఇక్కడ పక్కా ఐటీ సంస్థలను తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి దీనిపై స్పందించి, తగిన చర్యలు తీసుకుంటారని ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.






