మొండి పట్టుతో పార్టీ వీడారు: జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

మొండి పట్టుతో పార్టీ వీడారు: జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై తీవ్రస్థాయిలో స్పందిస్తూనే, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "జీవన్ రెడ్డి గారి మర్యాదను గానీ, గౌరవాన్ని గానీ పార్టీ ఎప్పుడూ తగ్గించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అందరం శక్తివంచన లేకుండా కష్టపడ్డాం. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించినా, ఆయన కోరిన విధంగానే నిజామాబాద్ టికెట్ ఇచ్చాం. దురదృష్టవశాత్తు అక్కడ ఆయన ఓడిపోయారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన సూచించిన వారికే టికెట్లు కేటాయించాం" అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 40 ఏళ్లుగా తన కోసం పనిచేసిన కార్యకర్తల భవిష్యత్తును జీవన్ రెడ్డి విస్మరించారని సీఎం విమర్శించారు. "భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకు నేను హామీ ఇచ్చినా వినకుండా మొండి పట్టుతో పార్టీ వీడారు. దుర్మార్గుడైన కేసీఆర్‌తో జతకట్టడం అత్యంత బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి గారు కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. ఆయన వయసుకి, అనుభవానికి ఇది తగదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీని నిలబెట్టడం తప్పా..?

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేందుకు తాము ప్రయత్నిస్తుంటే, జీవన్ రెడ్డి వెళ్లి వారితో కలవడం ఏంటని సీఎం ప్రశ్నించారు. "ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే.. దానిని నిలబెట్టడం తప్పా? నేను చేస్తుంది మంచో చెడో మీరే ఆలోచించండి. ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది" అని నాయకులతో అన్నారు. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించి పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను సీఎం అభినందించారు. "ధైర్యంగా ఉండండి.. త్వరలోనే జగిత్యాలకు వచ్చి కార్యకర్తలను కలుస్తాను. మనమంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం కావాలి" అని పిలుపునిచ్చారు.

Next Story