‘తెలుగోడి సత్తా చూపించాల్సిన టైమొచ్చింది’.. చంద్రబాబు, కేసీఆర్, పవన్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు.

‘తెలుగోడి సత్తా చూపించాల్సిన టైమొచ్చింది’.. చంద్రబాబు, కేసీఆర్, పవన్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ కూటమి దుర్వినియోగం చేస్తోందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న ఇండియా కూటమి ఒకవైపు.. రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ పడుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికను అందరూ విచక్షణతో గమనించాలని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగు వాడిపై ఉందని అన్నారు. పీవీ నరసింహా రావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, జనసేన, ఎంఐఎం పార్టీలు అన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. చంద్రబాబు(Chandrababu), కేసీఆర్(KCR), పవన్ కల్యాణ్(Pawan Kalyan), జగన్‌(Jagan)లు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని.. మనందరం ఒక్కటే అనే నిదానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం అని అన్నారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కాదు.. రాజ్యాంగ పరిరక్షకడిలా పనిచేస్తాడని చెప్పారు. గతంలో నంద్యాల నుంచి పీవీ నరసింహా రావు పోటీ చేస్తే.. ఎన్టీఆర్ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని అన్నారు.

Next Story