వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్ సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-14 14:18:43  IST  )

తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్ సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు, వరద ముప్పు మరియు ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలని, యూరియా పంపిణీ బాధ్యతను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించాలన్నారు. యూరియా పంపిణీలో రెవెన్యూ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

శాఖల మధ్య సమన్వయం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగాలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా, అలాగే రాష్ట్ర రాజధానిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే రెస్క్యూ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగేలా సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాల్లో వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్లు బాధ్యత వహించాలన్నారు. వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికల ఆధారంగా కనీసం 3 గంటల ముందే ప్రజలను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Next Story