బాసర ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు.. ఆ తర్వాతే పిప్రి గ్రామానికి!

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

బాసర ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు.. ఆ తర్వాతే పిప్రి గ్రామానికి!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడంతో పాటు, ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా బాసర చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారికంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం చేపట్టిన ఈ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బాసర పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పిప్రిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. బాసర మరియు పిప్రిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Next Story