జేపీ నడ్డాతో ముగిసిన భేటీ.. CM రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే!

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియా(Urea)ను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డా(JP Nadda)కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞ‌ప్తి చేశారు.

జేపీ నడ్డాతో ముగిసిన భేటీ.. CM రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియా(Urea)ను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ న‌డ్డా(JP Nadda)కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయ‌న అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం క‌లిశారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం.. సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని కోరారు. జులై నెలకు సంబంధించి 63 వేల మెట్రిక్ ట‌న్నులు దేశీయంగా ఉత్ప‌త్తి అయిన యూరియా, 97 వేల మెట్రిక్ ట‌న్నుల విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా మాత్ర‌మే చేశార‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు. యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేక్‌లు కేటాయించ‌డం లేద‌ని... వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేంద‌ర్ రెడ్డి, ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story