ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి.. పార్టీని విజయతీరానికి చేర్చిన ప్రణాళిక ఇదే!

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు.

ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి.. పార్టీని విజయతీరానికి చేర్చిన ప్రణాళిక ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అభ్యర్థి ఎంపిక నుంచి చివరి రోజు ఓటింగ్ రోజు చివరి గంట వరకు ప్రత్యేకంగా సమీక్షించారు. ఎన్నిక ఏదైనా తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటానని ముందు చెప్పినట్టుగానే రంగంలోకి దిగిన రేవంత్ పార్టీని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చారు. జూబ్లీ‌హిల్స్ నియోజకవర్గం ఏర్పాటయ్యాక మొదటి, చివరిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయం హస్తం చేజిక్కింది. ఇక్కడ పార్టీ కేడర్ అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఉపఎన్నిక రావడంతో మొదట్లో సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌కే మొగ్గు చూపాయి. అందుకే సీఎం ఈ ఉపఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతూ పక్కా వ్యూహరచనతో సక్సెస్​అయ్యారు. అభ్యర్థి ఎంపిక నుంచి పోల్ మేనేజ్‌మెంట్ వరకూ అన్ని అంశాల్లో రేవంత్ తనదైనశైలిలో బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆయన జూబ్లీహిల్స్‌లోనూ బీసీ అభ్యర్థినే నిలిపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి చక్రం తిప్పారు. ఎన్నికకు 2 నెలల ముందుగానే ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లను క్షేత్రస్థాయిలో నియమించి నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి గ్నీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ చర్యలతో ప్రభుత్వం పట్ల స్థానిక ప్రజల్లో సానుకూలత ఏర్పడింది.

ఆ 4 రోజుల్లో సీన్ రివర్స్..

సీఎం స్థాయిలో ఒక ఉపఎన్నిక కోసం ఇన్నిసార్లు ప్రచారానికి వస్తారా? అని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసినా రేవంత్‌రెడ్డి వాటినేమీ పట్టించుకోలేదు. డివిజన్ల వారీగా 3 దశలుగా ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మొత్తంగా నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటించి తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నవీన్ యాదవ్ గెలిస్తే జరిగే నియోజకవర్గ అభివృద్ధిని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ప్రసంగాలు కొనసాగాయి. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టి, మరోవైపు కవిత బీఆర్ఎస్‌పై చేస్తున్న ఆరోపణలు ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. నియోజకవర్గంలో సినీ కార్మికుల సమ్మెపై వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం నిర్మాతలు కార్మికులకు అనుకూలంగా స్పందించే విధంగా చర్చలు చేపట్టారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి సినీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సినీ కార్మికుల మద్దతు కూడా కాంగ్రెస్‌కు దక్కింది.

పకడ్బందీ పోల్ మేనేజ్‌మెంట్..

ఈ ఉపఎన్నికలో రేవంత్‌రెడ్డి పోల్ మేనేజ్‌మెంట్‌ను సక్సెస్ ఫుల్‌గా నిర్వర్తించారనే చెప్పుకోవాలి. మొదట బీఆర్ఎస్ వైపు ఉన్న మొగ్గును తన ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికలతో కాంగ్రెస్ వైపు తిప్పగలిగారు. పోలింగ్ బూత్‌లలో ఏజెంట్ల నియామకం దగ్గర నుంచి పోలింగ్​ముగిసే వరకూ దిశానిర్దేశం చేశారని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ విజయం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మరింత బలమైన నేతగా ఆవిర్భవించారనే చెప్పుకోవాలి. అటు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు ఇటు పార్టీపై పట్టు సాధించారని చెప్పవచ్చు. మరోవైపు అధిష్టానం వద్ద కూడా ఆయన పాపులారిటీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇకపై తన పాలనలో మరింత దూకుడుగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకు లభించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Next Story