అది తెలంగాణ డీఎన్ఏలోనే ఉంది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

టెక్స్‌టైల్ తమకు కేవలం పరిశ్రమ కాదని.. అది జీవనాధారమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

అది తెలంగాణ డీఎన్ఏలోనే ఉంది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెక్స్‌టైల్ తమకు కేవలం పరిశ్రమ కాదని.. అది జీవనాధారమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ 2026లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ నుండి గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్ నుండి నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడ ఉన్నాయని అన్నారు. తెలంగాణ టెక్స్‌టైల్ రంగంలో ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొంటున్న మీరు కేవలం అతిథులు మాత్రమే కాదని.. తమ అభివృద్ధి భాగస్వాములని.. తమ విజన్‌ను పంచుకునే స్నేహితులని పేర్కొన్నారు. అలాగే.. అత్యుత్తమ వస్త్రాలను త‌యారు చేసిన‌ గొప్ప చరిత్ర భార‌త‌దేశానికి ఉన్నదని.. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాయని చెప్పారు. శ్రీ రామనవమి సందర్భంగా తమ సంప్రదాయం ప్రకారం సీఎం హోదాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పవిత్ర వస్త్రాలను సమర్పించడం తనకు గౌరవమని అన్నారు. టెక్స్‌టైల్ తెలంగాణ డీఎన్ఏలోనే ఉన్నదని.. నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని వెల్లడించారు. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో తాము అగ్ర స్థానంలో ఉన్నామని.. తమ పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్నదని చెప్పారు. తెలంగాణ పత్తి పొలాల నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తాము క‌లిసి ప‌నిచేస్తున్నామని తెలిపారు.

వరంగల్‌లో ప్రపంచస్థాయి టెక్స్‌టైల్ పార్క్...

వరంగల్‌లో కాకతీయ ప్రపంచ స్థాయి మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామమని.. ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో నైపుణ్యం.. సంకల్పం కూడా ఉన్నదని అన్నారు. డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజ‌లో ఉన్నదని వెల్లడించారు. తమ విజన్ తెలంగాణ రైజింగ్ 2047 అని.. 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తమ విజ‌న్ అని స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 2027 నాటికి వందేళలు పూర్తి చేసుకుంటున్నదని.. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహాకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుందని చెప్పారు. ప్రపంచానికి సరితూగే విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ‘మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం. కలిసి ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం’ అని పిలుపునిచ్చారు. హైదరాబాద్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతున్నదని.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించిందని చెప్పారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయని.. ఇప్పుడు హాలీవుడ్ సైతం చేరిందన్నారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ తమ అత్యున్నత ప్రాధాన్యమని.. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్రం మనదని.. ఆపిల్ ఇయర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగ‌స్వాములు కావాలన్నారు.

టెక్స్‌టైల్ అంటే నేతన్నకు అందించే సామాజిక న్యాయం...

తమ దృష్టిలో టెక్స్ టైల్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని.. అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. వందేళ్ల కింద మహాత్మాగాంధీ చరఖాతో స్వేచ్ఛ కేవలం బ్యాలెట్ బాక్స్(ఓటు) ద్వారా మాత్రమే కాదు, మగ్గం ద్వారా కూడా వస్తుందని స్వదేశీ ఉద్యమంతో నిరూపించారన్నారు. భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని తెలిపారు. ఆ దిశగానే తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న కేవలం కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. చరఖాకు టెక్నాలజీని అనుసధానించి మేడిన్ తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో న్యూ స్వదేశీ విజన్‌‌కు ఈ వేదికపై నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణను కొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేధో కేంద్రంగా తీర్చిదిద్దేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Next Story