మినిస్టర్స్ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్..! హైకమాండ్‌కు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి

by Kema Shiva Kumar |

మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు రిపోర్టు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

మినిస్టర్స్ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్..! హైకమాండ్‌కు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు రిపోర్టు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్‌లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొనట్లు తెలిసింది. నిజానికి ప్రతినెలా మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు, ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్టు పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తిస్థాయి నివేదికను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తున్నది.

విడివిడిగా నివేదికలు

మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన సీఎం రేవంత్.. సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్ది పేపర్లను ఉపయోగించినట్లు తెలుస్తున్నది. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు, వివాదాలు, అవినీతి ఆరోపణలను సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు? సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు? ఏఏ అంశాలపై సమీక్షలు జరిపారు? ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? అనే అంశాలను సైతం వివరించినట్లు సమాచారం. సెక్రెటేరియట్‌లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు? ఇంటికి వెళ్లే అతిథులు ఎందరు? అటు ఆఫీసుకు, ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతారు? వీకెండ్‌లో ఎక్కడ ఉంటున్నారు? అనే అంశాలను సైతం రిపోర్టులో చేర్చినట్లు సమాచారం.

శాఖపై పట్టులేని మంత్రులు

ఈ మధ్య కొందరు మంత్రులు వ్యవహరించిన తీరు విపక్షాలకు ఆయుధాలుగా మారాయి. కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆ అంశాల చుట్టూ విమర్శలు చేస్తున్నాయి. దీంతో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది? అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పూర్తిస్థాయి రిపోర్టును అధిష్టానానికి ఇచ్చినట్లు తెలుస్తున్నది. కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం సైతం చేయట్లేదని విమర్శలున్నాయి. రెగ్యులర్‌గా అధికారులను పిలిచి రివ్యూలు పెట్టేందుకు మంత్రులు అనాసక్తిగా ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కేవలం తమకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలపైనే పదేపదే సమీక్షలు జరిపి మిగతా అంశాలను పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రులకు అధికారులపై పూర్తిస్థాయి పట్టురావట్లేదని, మంత్రులకు తెలియకుండానే ఆఫీసర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నట్టు విమర్శలున్నాయి. కొందరు మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైళ్లను చూసేందుకు సైతం పెద్దగా ఆసక్తి చూపరని ప్రచారం ఉంది.

అవినీతి ఆరోపణలు..

కొందరు మంత్రులు తమ శాఖ పరిధిలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేసి వివాదాలు సృష్టించిన సందర్భాలున్నాయి. మంత్రులు తమ శాఖ పరిధిలో టెండర్లు, కాంట్రాక్టు పనుల అంశాలపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు? అనే అంశాలపై ఆధారాలతో సహా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు మంత్రులు అవినీతి అధికారులను అదే పనిగా ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఏ మంత్రి ఏ అధికారులను ప్రొత్సహిస్తున్నారు? ఏ ఆఫీసరుకు పోస్టింగ్ ఇప్పించారు? ఎవరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు? అనే అంశాలను వివరించినట్లు తెలిసింది. తమకు ఉన్న పవర్‌తో కొందరు మంత్రులు హైదరాబాద్ శివారులో రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో వాటాదారులుగా చేరినట్లు టాక్. అలాంటి మంత్రుల జాబితాను సైతం అధిష్టానానికి అందించినట్లు సమాచారం.

బంధువుల జోక్యం..

మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రమేయాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు మంత్రులు తమ పిల్లలు, భార్యలు, తమ్ముళ్లు, అన్నలను ప్రొత్సహిస్తుంటే.. మరికొందరు అత్యంత సన్నిహితులకు స్వేచ్ఛనిస్తున్నారని విమర్శలున్నాయి. దీంతో మంత్రుల శాఖల్లో ఫ్యామిలీ మెంబర్ల జోక్యం పెరిగి చివరికు ఆఫీసర్లను ఆదేశించే స్థాయివరకు వెళ్లిన సందర్భాలు ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కొందరు మంత్రుల సన్నిహితులు ఆ శాఖల్లో జరిగిన ప్రమోషన్లు, బదిలీల సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. మంత్రుల హోదాలో జిల్లాల్లో సృష్టిస్తున్న రాజకీయ వివాదాలు, ప్రజలతో కొనసాగిస్తున్న సంబంధాలను సైతం రిపోర్టులో చేర్చినట్లు తెలిసింది.

Next Story