కృష్ణా జలాల విషయంలో రాజీ పడేదే లేదు : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోమని, కృష్ణానీటికోసం చేస్తున్న న్యాయపోరాటంలో ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నామని చెప్పారు.

కృష్ణా జలాల విషయంలో రాజీ పడేదే లేదు : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని (Telangana Prajapalana Dinotsavam) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ (Gun Park) వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం .. ఈ ప్రజాపాలన దినోత్సవమని తెలిపారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న చరిత్ర మనదన్నారు. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయమే నేడు మనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17 అని, అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామంటూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ స్వేచ్ఛా సాధన కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడబోమని చెప్పడానికి మన చరిత్రే సాక్ష్యంగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వ సంకెళ్లను బద్దలుకొట్టి స్వేచ్చకు ఊపిరిపోసేందుకు ఊపిరి వదిలిన వందలాది మంది అమరవీరులకు ఈ సందర్భంగా సీఎం నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదన్నారు. ఈ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని, అందుకే రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నామని సంచలన ప్రకటన చేశారు.

ప్రజాపాలనలో నేడు కష్టమైనా నష్టమైన ప్రజలతోనే పంచుకుంటున్నామని, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ.. తప్పులను సరిదిద్దుకుంటున్నామన్నారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని, అందుకే యంగ్ ఇండియా స్కూల్స్ కు శ్రీకారం చుట్టామని వివరించారు. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నామన్నారు. అలాగే విద్యతోపాటు స్పోర్ట్స్ కి కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. విద్యలో రాష్ట్రం ముందుండేలా త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు.

రైతన్నను రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరిత విప్లవం నుంచి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుంచి రైతు భరోసా వరకూ.. రైతుల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయన్నారు. ఆ వారసత్వాన్ని ప్రజా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,616 కోట్ల రైతు రుణమాఫీలు చేసి రుణ విముక్తుల్ని చేశామని, దేశంలో ఈ స్థాయిలో రైతు రుణమాఫీలు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా రైతుల సంక్షేమం విషయంలో రాజీపడలేదని, రాజీపడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ.. వరిని కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లోకి కూడా గంజాయి విస్తరిస్తోందన్న సీఎం.. ప్రజలు అండగా నిలబడితే తెలంగాణను పట్టి పీడిస్తోన్న మత్తుమాఫియాను తరిమికొడతామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో తీసివేస్తామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా వారిని కటకటాల వెనక్కి పంపితీరుతామన్నారు.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోం..

ఇక కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోమని, కృష్ణానీటికోసం చేస్తున్న న్యాయపోరాటంలో ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి.. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారిస్తామన్నారు. ఇక మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఏడాది డిసెంబర్ లో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టి, మూసీ చుట్టూ బ్రతుకుతోన్న ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న విడుదల చేసి, తెలంగాణ జాతికి అంకితం చేస్తామన్నారు. రాబోయే వందేళ్ల కోసం విజన్ డాక్యుమెంట్ ను రెడీ చేస్తున్నామని, ఈ విజన్ డాక్యుమెంట్ కోసం సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుస్తామని చెప్పారు. హైదరాబాద్ ను కొందరు గేట్ వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారని, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ ను మారుస్తామని తెలిపారు. ఫోర్త్ సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story