- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజన్-2047కు అనుగుణంగా రోడ్ల అభివృద్ధికి ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ విజన్ 2047 ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలని, అన్ని జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు, పురోగతి, భవిష్యత్ అవసరాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్ల నిర్మాణంలో సమస్యలు లేకుండా చూడాలి...
రోడ్ల నిర్మాణంలో సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమీక్షలు నిర్వహించి స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే ఆ రింగ్ రోడ్లను జాతీయ, రాష్ట్ర హైవేలతో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యాసాధ్యాలను సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఆసుపత్రుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి...
ఇక ఆరోగ్య రంగంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల భవనాల పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సహా రోడ్లు భవనాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






