CM Revanth Reddy: ‘గాంధీ స‌రోవ‌ర్’ శంకుస్థాప‌నకు రండి.. రాజ్‍నాథ్‍సింగ్‍కు సీఎం ఆహ్వానం

by Prasad Jukanti |   (  Updated:2026-02-12 06:20:40  IST  )

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.

CM Revanth Reddy: ‘గాంధీ స‌రోవ‌ర్’ శంకుస్థాప‌నకు రండి.. రాజ్‍నాథ్‍సింగ్‍కు సీఎం ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్‍సింగ్‍తో (Rajnath Singh) భేటీ అయ్యారు. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మత్రిని సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ న‌దుల సంగ‌మ స్థలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం రక్షణశాఖ మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మ‌హాత్ముని చిత‌భ‌స్మాన్ని ఈసా, మూసీ సంగ‌మ స్థలంలో నిమజ్జనం చేశారని రాజ్‍నాథ్‍సింగ్‍కు వివరించారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేపడుతున్నామని బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ చిహ్నంగా నిలపనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌-2047 ను రాజ్‍నాథ్‍సింగ్‍కు రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, అనిల్ కుమార్ గౌడ్, వంశీకృష్ణ, కడియం కావ్య ఉన్నారు.

రక్షణ శాఖ భూముల అంశం ప్రస్తావన:

ఈ సందర్భంగా మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు (Gandhi Sarovar Project) అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేస్తోంది.

Next Story