కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. మెట్రో ఫేజ్-2 అనుమతులపై చర్చ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-06 12:38:04  IST  )

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో ఫేజ్ 2 పనులపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయి చర్చించారు.

కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. మెట్రో ఫేజ్-2 అనుమతులపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. మెట్రో ఫేజ్-2కు సంబంధించి ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి అధికారిక అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ (Future City) వరకు ప్రతిపాదించిన మెట్రో కారిడార్‌ను ఫేజ్-3 కింద పరిగణనలోకి తీసుకోవాలని కూడా సీఎం విన్నవించారు.

పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ నిధులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణ అత్యంత ఆవశ్యకమని సీఎం వివరించారు. ముఖ్యంగా జేబీఎస్ - మెడ్చల్, జేబీఎస్ - శామీర్‌పేట వంటి కీలక మార్గాల విస్తరణ ద్వారా నగరవాసులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఖట్టర్ ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మెట్రో అనుమతులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

Next Story