- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మళ్లీ నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ’.. CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామక పత్రాలు అందజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీపావళి వేళ గ్రూపు-2 అభ్యర్థులతో పాటు వారి కుటుంబాల్లో కూడా ఆనందం కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువతది కీలక పాత్ర అని గుర్తుచేశారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు సైతం చేశారని అన్నారు. తాము చనిపోయినా పర్వాలేదు.. యువత ఆకాంక్షలు నెరవేరుతాయని బలిదానాలు చేశారని కొనియాడారు. అలాంటి యువత తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇచ్చిన నోటిఫికేషన్‌లు పెండింగ్‌లో పెడుతూ చుక్కలు చూపించారని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని అన్నారు. చిక్కులన్నీ తొలగించి అభ్యర్థులకు నియామకపత్రాలు అందిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.
అల్లుడిని అంబానీగా, కొడుకును అదానీగా చేయడం కోసమే గత పదేళ్లు పాలన జరిగింది. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యేది కాదు. రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక మహా ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరుగలేదు. తన ఫామ్‌హౌజ్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన(KCR) చెప్పారు. ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను తెలంగాణ యువతకు, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు, హోదాలను తన కుటుంబీకులకే ఇఛ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వెంటనే వారికి ఎమ్మెల్సీలు, ప్లానింగ్ కమిషన్‌లో పదవులు ఇచ్చింది. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. తన కుటుంబం, బంధువుల ఉద్యోగాల గురించి ఆలోచించినట్లు యువత గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ మహిళల గురించి ఆలోచించలేదు. నిజాం నవాబులతో పోటీ పడి మరీ ఆస్తులు పెంచుకున్నారు. కానీ గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రజల ఆశీర్వాదాలే కారణమని చెప్పారు.
గ్రూపు-2 అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం.. తెలంగాణ పునర్:నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నాయకులం తాత్కాళికం.. అధికారులే శాత్వతం అని అన్నారు. రేపటి రోజున నేను ముఖ్యమంత్రిగా ఉండకపోయినా.. మీరు మాత్రం అధికారులుగానే ఉంటారు. ప్రజలకు మేలు చేసే పనులేవీ ఆపకుండా కొనసాగించాలని కోరారు. నాకంటూ ప్రత్యేకమైన సైన్యం, వ్యవస్థ లేదు. అందరం ప్రజలకు సేవకులమే అని అన్నారు.






