- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: ఫామ్ హౌస్‌లో పడుకోను.. ఉపాధ్యాయులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని, ఆ భవిష్యత్తును ఉపాధ్యాయుల చేతుల్లో పెడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అని, ఆ భవిష్యత్తును ఉపాధ్యాయుల చేతుల్లో పెడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు క్రియాశీలక పాత్ర పోషించారని, ప్రతి గ్రామానికి తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కానీ గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని, టీచర్ల సమస్యలను గాలికి వదిలేసిందని సీఎం విమర్శించారు. ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా (Best Teacher Awards) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని అభిప్రాయపడ్డారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకోసం కేశవరావు అధ్యక్షతన కమిటీ వేసినట్లు తెలిపారు. పేదల తలరాతను, రాష్ట్ర తలరాతను మార్చేది ఒక్క చదువు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఫామ్ హౌస్ లో పడుకోను
తాను గ్రామీణ ప్రాంత, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినని, మనం ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదని అభిప్రాయపడ్డారు. టీచర్లే కష్ట పడండి, తాను ఫామ్ హౌస్ లో పడుకుంటా మళ్లీ సీఎం చేయండి అని అనట్లేదని సెటైర్లు వేశారు. విద్యాభివృద్ది కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తానని, ఎలాంటి మారుమూల తండానైనా సందర్శిస్తానని తెలిపారు. ఈ పదేళ్లలో గురుపూజోత్సవ కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా అని టీచర్లను సీఎం ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే తాను రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలుస్తానని, తాను కూడా ఉఫాధ్యాయులతో కష్టపడతానని పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రివాల్ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణమని, తనకూ ఆ స్వార్థం ఉందని, టీచర్లు బాగా పనిచేస్తేర రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.
విద్యారంగం పై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రులు సాధారణంగా రెవెన్యూ, ఆర్థిక, నీటిపారుదల శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారు, కానీ తాను ప్రజల సోదరుడిగా విద్యారంగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగంలో పదేళ్ల పాలనలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించేందుకు స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను విద్యారంగాన్ని పర్యవేక్షించడంపై విమర్శలు వచ్చాయని, అయితే పేదల పిల్లలు బాగుపడాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే హామీ పదేళ్లు గడిచినా అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి అత్యంత కీలకమైందని, విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. గత పదేళ్లుగా ఉపాధ్యాయుల బదిలీలు జరగలేదని, 2017 నుంచి నియామకాలు కూడా లేవని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 55 రోజుల్లోనే 11 వేల టీచర్ల నియామకాలను పూర్తి చేసిందని, ఇది ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు
విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని, విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేశాయని ఆయన విమర్శించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు గత వైభవాన్ని కోల్పోయాయని ఆయన అన్నారు. టీచర్ల జీతాలు పెంచడమే కాకుండా, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని, ఇందుకోసం ఏటా రూ.130 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు.
విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించేందుకు 'స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. ఏటీసీలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే తనకే మతిపోతుందని సీఎం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంలో తగ్గుతూ వచ్చిందని, అయితే తమ ప్రభుత్వం వచ్చాక 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని సీఎం వెల్లడించారు. ఇది ఉపాధ్యాయుల కృషికి దక్కిన ఫలితమని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుదామని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రయివేటు స్కూల్ టీచర్లకంటే ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఉపాధ్యాయులు కూడా వారితో కలిసి భోజనం చేయాలని, తద్వారా లోపాలు సరిదిద్దుకోవచ్చని ఆయన సూచించారు.
క్రీడలకు ప్రాధాన్యం
140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒలంపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేదని వాపోయారు. దక్షిణ కొరియాలో ఒక్క యూనివర్శిటీలో 16 గోల్డ్ మెడల్స్ సాధించిందని రేవంత్ రెడ్డి అన్నారు. చదివితేనే భవిష్యత్ కాదని, క్రీడల్లో రాణించినా భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వం నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించిందని, క్రీడల్లో రాణించిన క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీలను చేసినట్లు తెలిపారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
డ్రగ్స్ కు దూరంగా
ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ పెడ్లర్ గా మారుతున్నారని, డ్రగ్స్ వ్యసనాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించాయని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను, ఉపాధ్యాయులు కలిసి నవ తెలంగాణను పునర్నిర్మిద్దామని ఆయన ముగించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యా కమిషన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






