స్కూళ్లలో పీఈటీల నియమకాలకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు.

స్కూళ్లలో పీఈటీల నియమకాలకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషన‌ల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం సమీక్షించారు. విద్యాశాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ(EWIDC) కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని ఆదేశించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూటేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

= మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాలి. ఈ విష‌యంలో ఎలాంటి అల‌స‌త్వం చూపొద్దు.

= మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి.

= కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రాధాన్య‌మివ్వాలి. వాటిపై సోలార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవ‌చ్చు.

= ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాలి.

= అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి.

= సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ర్ల‌ను నియ‌మించాలి.

విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాకుండా పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూడాల‌ని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌‌కి విజ్ఞ‌ప్తి చేశార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు.

Next Story