అల్లు అర్జున్ కోసం సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకంగా కోకాపేట్‌ వెళ్లి..

by Gantepaka Srikanth |

హైదరాబాద్ కోకాపేటలో అల్లు అర్జున్ 'అల్లు సినిమాస్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్క్రీన్లను పరిశీలించారు.

అల్లు అర్జున్ కోసం సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకంగా కోకాపేట్‌ వెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కోకాపేటలో అల్లు అర్జున్ 'అల్లు సినిమాస్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్క్రీన్లను పరిశీలించారు. అంతకుముందు అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, ఈ అల్లు సినిమాస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. ఇందులో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా నిలుస్తోంది. ఆసియాలో అతిపెద్దదిగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా దీనికి గుర్తింపు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దారు. స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, ప్రతి దిశ నుంచి వచ్చే అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్‌ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు, జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్‌లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. నేడు ప్రారంభం జరుగడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది.

Next Story