- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మాటిస్తున్నా.. తప్పకుండా సాయం చేస్తా’: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. రోడ్లు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి గారు స్థానికులతో మాట్లాడారు. కొడంగల్‌కు ఎంత మేరకు సాయం చేస్తానో కామారెడ్డి జిల్లాకు కూడా అంత సాయం చేస్తానని మాటిచ్చారు. వరద నష్టంపై గ్రామాల వారిగా అంచనాలు రూపొందించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జీలు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Irrigation Project)లతో పాటు పంట నష్టానికి సహాయం అందిస్తామన్నారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి(Kamareddy) జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. నష్టపోయిన వారిని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుంది. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో వరదల నష్టాన్ని అంచనా వేయాలి. పంట నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు కూడా అంచనాలు రూపొందించాలి” అని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
“వరదల వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రజలకు అండగా నిలిచారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నిజమైన నాయకుడు. ఎమ్మెల్యే లాగే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు భారీ వరదను కూడా తట్టుకుని నిలబడి అందర్నీ కాపాడింది. తాత్కాలిక మరమ్మతులు చేశాం. అయితే ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికే ఇక్కడికి వచ్చాం. నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం..” అని ముఖ్యమంత్రి బాధితులకు భరోసానిచ్చారు.
మొదట తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులతో కలిసి వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించారు. వరదల వల్ల లింగంపేటలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి బ్రిడ్జీని పరిశీలించారు. వరదలు వచ్చిన సందర్భంగా ఉత్పన్నమైన పరిస్థితులపై అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం తాత్కాలిక మరమ్మతులతో కాకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కామారెడ్డి జీఆర్ కాలనీ సందర్శించిన సందర్భంగా బాధితులతో మాట్లాడారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, పశుసంపద కోల్పోయిన వారికి సాయం అందించాలని ఆదేశించారు. “భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆస్తినష్టం జరిగినప్పటికీ అప్రమత్తంగా ఉండటం ప్రాణ నష్టం తగ్గించగలిగాం. వరదలు రాగానే క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందిగా జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కని, సలహదారు షబ్బీర్ అలీని, ఎంపీ సురేష్ షేట్కర్‌ని, ఎమ్మెల్యేలను ఆదేశించాను. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేశా. ఇక్కడి సమస్యల పరిష్కారానికి వందశాతం ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం..” అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.






