బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ ఎంక్వయిరీ క్లోజ్.. వాట్ నెక్స్ట్?

by Prasad Jukanti |

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్‌ కేసులో సీఐడీ విచారణ నేటితో ముగిసింది.

బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ ఎంక్వయిరీ క్లోజ్.. వాట్ నెక్స్ట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్‌ కేసులో (Betting Apps Case) సీఐడీ విచారణ నేటితో ముగిసింది. యాప్‌లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్యుయెన్సర్లు, నటులు, ప్రముఖులను విచారించింది. ఇవాళ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి, నటి మంచు లక్ష్మి, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌‌లను సీఐడీ (CID) అధికారులు విచారించారు. రెండు గంటలకు పైగా వీరిని ప్రశ్నించారు. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మరోవైపు.. ఇదే కేసులో ఇప్పటికే నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌ రాజ్, విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్లు శ్రీముఖి, యాంకర్‌ విష్ణుప్రియ, నటి అమృత చౌదరి సీఐడీ అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్‌కు ఎందుకు ప్రమోట్ చేశారు? అందుకు ఎంతెంత తీసుకున్నారు? యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, ఈ కేసులో మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఎఫ్ఐఆర్లు ఆధారంగా కేసు నమోదు

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లకు బానిసై చాలామంది యువత అప్పుల్లో కూరుకుపోయారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీటిపై పలు పోలీస్ స్టేషన్లపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయయి. వీటిని ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసి 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను సీఐడీ విచారించింది. ఇవాళ రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్‌ విచారణతో ఈ కేసు విచారణ ముగిసింది. ఇక బెట్టింగ్‌ యాప్‌ కేసులో సీఐడీ తుది రిపోర్టును తయారు చేయనుంది. ఇందులో ఏముండబోతున్నదనేది సస్పెన్స్‌గా మారింది.

Next Story