సీఐ సారూ.. రూటే సెప‘రేటు’

by Disha Web Desk 4 |
సీఐ సారూ.. రూటే సెప‘రేటు’
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి పైసలు ఇస్తేనే పని అన్న చందంగా సొంత రూల్స్ పెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్ట్‌గా సార్‌ని కలవకుండా ఆయన గన్ మెన్ కలిస్తే పని ఇట్టే అయిపోతుందని సదరు అధికారి బాధితులే చెప్తున్నారు. అయితే తనకంటూ ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నెలవారీ మామూళ్లకు తెరలేపాడని, అంతటితో ఆగకుండా సివిల్ తగాదాల్లో తలదూర్చుతూ సెటిల్మెంట్లు చేస్తూ పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

పాస్ పోర్ట్‌కు డబ్బులు డిమాండ్?

జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది సదరు యువకుడు భార్యతో గొడవలు జరిగిన కారణంగా అతడు గల్ఫ్‌లో ఉండగానే ఇక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సదరు యువకుడు ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు. యువకుడిపై కేసు నమోదైన విషయాన్ని ఎయిర్ పోర్టు పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఆ యువకుడి పాస్ పోర్టును పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. ఇక్కడవరకు బాగానే ఉన్నా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పాస్ పోర్టు తిరిగి ఇవ్వవలసిందిగా బాధితుడు పోలీసులను అప్రోచ్ అవ్వగా సదరు సీఐ గన్ మెన్ రూ. 40 వేలు డిమాండ్ చేశాడని, అంత ఇవ్వలేనని బతిమిలాడి రూ. 30 వేలు ముట్ట చెప్పానని యువకుడు ఆరోపిస్తున్నాడు. అయితే పోలీసులు పాస్ పోర్టును ఆ యువకుడికి ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

డీజీపీకి ఫిర్యాదు..

అడిగినన్ని డబ్బులు ఇచ్చినా కూడా తన పాస్ పోర్టు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బాధిత యువకుడు డీజీపీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎస్బీ పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఓ ప్రజా ప్రతినిధి పట్ల జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారని మంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ ఎస్సైని జిల్లా కార్యాలయానికి అటాచ్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ ఫర్ చేసిన అధికారులు ఈ విషయంలో మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై గాని ఆయన గన్ మెన్‌పై గాని ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed