శాసనసభలో గందరగోళం.. నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

by Kema Shiva Kumar |

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు పున:ప్రారంభం కాగా.. రెండో రోజు సభ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది.

శాసనసభలో గందరగోళం.. నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సభలో భారీ నిరసనకు దిగింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ఎల్పీ నేతలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు.‘కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. యూరియా కొరతపై చర్చ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు.

మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

ప్రతిపక్షాల నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులకు ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) జరగడం ఇష్టం లేనట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఏదైనా సమస్య ఉంటే సభలో నిర్ణీత ఫార్మాట్లలో చర్చకు రావాలి తప్ప, ఇలా నిరసనలతో సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని మంత్రి సూచించారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ వివాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూరియా అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ కోరగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందుకు పూర్తిగా నిరాకరించారు. క్వశ్చన్ అవర్‌లో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం ఉండదని క్లియర్ కట్‌గా హరీశ్ రావుకు చెప్పేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా నినాదాలు కొనసాగించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రైతుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Next Story