కమలం పార్టీలో గందరగోళం.. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి

by Kema Shiva Kumar |

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిందనే ప్రచారం జరుగుతున్నది.

కమలం పార్టీలో గందరగోళం.. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారు? ఎలా వ్యవహరిస్తున్నారు? అనే సమాచారం జాతీయ నాయకత్వానికి లేదా? లేకపోతే అన్ని తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా? రాష్ట్ర పార్టీపై హై కమాండ్ పట్టు కోల్పోయిందా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు లీడర్ షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్న కేంద్ర నాయకత్వం.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్రంలో 18 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నా... వారిలో ఎవరికీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదు. పార్టీ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో ఉండేలా కొందరు తెరవెనుక మంత్రాంగం నడిపించడంతోనే ఇలా జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. అందుకే రామచందర్ రావు‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారని చర్చించుకుంటున్నారు. బలమైన నాయకత్వం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని, లేకుంటే ప్రజల మనసుల్లో నుంచి వెళ్లిపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల వేళ నాయకుల మధ్య పంచాయితీ, ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తామనే ఆశలు అడియాశలేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నది.

పలువురు ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి

పార్టీ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగంగానే మాట్లాడారు. ఎంపీగా గెలిచిన తర్వాత తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని, లేదా రాష్ట్ర అధ్యక్ష పదవైనా ఇస్తారని ఈటల ఆశించారు. కానీ, ఆ రెండింటిలో ఏ ఒక్కటీ ఆయనకు దక్కలేదు. పదవులు ఎందుకు ఇవ్వలేకపోయామని విషయాన్ని సైతం కేంద్ర నాయకత్వం ఆయనను పిలిచి చెప్పలేదు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఈటలను ఇరుకున పెట్టేలా, అవమానించేలా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి స్థానిక నియోజకవర్గంలో పర్యటించే స్వేచ్ఛ లేదా అని ఆయన అనుచరులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇతర నాయకులు బీజేపీలోకి రాకుండా కొందరు పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. లోకల్‌గా పార్టీ బలోపేతం కావడం ఇష్టం లేదా? అంటూ ప్రశ్నించారు. అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగానే ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యేల మధ్య సమన్వయలేమి

బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదని చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో వారి మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయినా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ వ్యవహరంపై అనేకసార్లు వార్తలు వచ్చినా, ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసినా.. పార్టీ నాయకత్వం మాత్రం సీరియస్ గా స్పందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

స్థానిక ఎన్నికలపై కొరవడిన సీరియస్‌నెస్

స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకత్వానికి సీరియస్ నెస్ కొరవడిందని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. ఎంపీలుగా గెలిచి కేంద్రంలో అధికారంలో ఉంటే సరిపోతుందా? స్థానికంగా బలపడాల్సిన అవసరం లేదా అని స్థానిక నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 2019లో బీజేపీకి రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్రమంత్రిగా సైతం వ్యవహరించారు. అప్పుడు పార్టీ ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు సైతం స్థానిక సంస్థల ఎన్నికలను లైట్‌గా తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ హడావుడి చేస్తుండగా.. బీజేపీ మాత్రం వర్క్ షాపుల పేరుతో శ్రేణులను ఉత్సాహపర్చని, ప్రయోజనం లేని కార్యక్రమాలు చేస్తున్నదంటూ సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ సారైనా సింగిల్ డిజిట్ దాటుతామా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల్లో పార్టీ ప్రతినిధులను గెలిపించుకోవడం ద్వారానే క్షేత్రస్థాయిలో బలోపేతమవుతామని, స్థానికంగా పార్టీ బలంగా లేకుంటే రాష్ట్ర స్థాయిలో ఎలా బలంగా మారుతుందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కింది స్థాయిలో బలంగా లేకున్నా ఫర్వాలేదనే రీతిలో నాయకత్వం వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడు ఎప్పటికైనా తమకు పోటీ అవుతాడనే అనుమానంతో కొందరు నాయకులు లోకల్ బాడీఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎంపీలుగా గెలిచిన నేతలు ఒక జెడ్పీటీసీ స్థానాన్నయినా గెలిపించుకోగలుగుతారా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Next Story