గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లకు నిధులు కేటాయించండి :సీఎంకి చాడ వెంకట్ రెడ్డి లేఖ

by Ramesh Naini |

గౌరవెల్లి, గండి పల్లి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి సీఎంని కోరారు.

గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లకు నిధులు కేటాయించండి :సీఎంకి చాడ వెంకట్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే గౌరవెల్లి, గండి పల్లి, తోటపల్లి రిజర్వాయర్, ఇందుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ 2007లో శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి సీఎంని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అప్పటి నుంచి సత్వరపూర్తికి అనేక విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాలు భూసేకరణ చేయడానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి విడతల వారీగా అరకొర నిధులు కేటాయించడంతో అవి పూర్తి కాలేదని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలోనే గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జరిగినప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో 40 శాతం మాత్రమే పూర్తి చేశారని, గండిపల్లి రిజర్వాయర్ ద్వారానే అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలకు 14 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని వివరించారు.

ప్రాజెక్టు పనుల పురోగతికి ముందడుగు

గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన చిక్కులు, భూసేకరణ లాంటి వాటిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు సమీక్ష చేసి ప్రాజెక్టు పనుల పురోగతికి ముందడుగు వేయడం శుభసూచకమని అన్నారు. కానీ ఆ సమావేశంలో గండిపల్లి రిజర్వాయర్ ప్రస్తావన లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి ఇప్పటికే 660 ఎకరాలకు గాను 300 ఎకరాలు భూమిని సేకరించబడింది, మిగతా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. గండిపల్లి ద్వారా మాత్రమే శ్రీరాంసాగర్ వరద కాలువ పూర్తి లక్ష్యం నెరవేరుతుందని, ఇప్పటి వరకు పనులు చేపట్టిన గండిపల్లి రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు. గండపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్ ను పూర్తి చేయాలని లేఖలో కోరారు.

Next Story