- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిగాచీ పరిశ్రమ సీఈవో అరెస్ట్ .. ఘటన జరిగిన ఆర్నెళ్లకు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ (Sigachi Industries Blast) పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచీ పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను (Sigachi CEO Amit Raj Sihana) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‍కు తరలించారు. జూన్ 30న పాశమైలారం ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికుల మృతితో సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు అయింది. దాదాపు ఆరు నెలలుగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు యాజమాన్యంపై చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సిగాచీ సీఈవోను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సమాచారం.
కాగా, సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో పేర్కొంది. అయితే ఈ కేసులో బాధ్యులను గుర్తించకపోవడం పట్ల గత నెలలో తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికీ బాధ్యలను గుర్తించకపోవడం ఏంటని మండిపడింది. దీనిపై ఏఏజీ నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణలో దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో వైపు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు ఇప్పటికే పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






