అర్బన్ చాలెంజ్ ఫండ్‌పై కేంద్రం కొత్త మెలిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-23 02:20:28  IST  )

అర్బన్ చాలెంజ్ ఫండ్ లో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. ప్రాజెక్టు ఏదైనా.. కేంద్రం నుంచి 25 శాతం నిధుల వస్తాయని స్పష్టం చేసింది.

అర్బన్ చాలెంజ్ ఫండ్‌పై కేంద్రం కొత్త మెలిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, పేదలకు ఉపాధి లభించేలా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఉద్దేశించిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్)’లో కేంద్ర ప్రభుత్వం ఈ సారి భారీగా కోత విధించింది. గతేడాది బడ్జెట్‌లో రూ.1.5 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది మాత్రం రూ.50వేల కోట్లకు కోతపెట్టి రూ.లక్ష కోట్లకు కుదించింది. రీ డెవలప్‌మెంట్ ఆఫ్ సిటీస్, గ్రోత్ కారిడార్లు, గ్రోత్ హబ్స్, వాటర్, శానిటేషన్, మురుగునీటి ప్రాజెక్టులకు మాత్రమే యూసీఎఫ్ నుంచి నిధులు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పట్టణాల అభివృద్ధి, గ్రోత్ కారిడార్లు, తాగునీటి సరఫరా, శానిటేషన్, మురుగు నీటి ప్రాజెక్టుల అమలుకు కేంద్రం నిధులపై పెట్టుకున్న భారీ ఆశలన్నీ అడియాసలయ్యాయి.

మార్గదర్శకాలు ఇలా..

అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఏ ప్రాజెక్టు కోసమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి 25 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థ, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, బోర్డు నుంచి 25 శాతం నిధులు తమ వాటాగా ఇవ్వాల్సిందే. మిగతా 50 శాతం నిధులను బాండ్లు, బ్యాంకు రుణాల రూపంలో సేకరించుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) ప్రాజెక్టులు అయితే సంబంధిత ఏజెన్సీ భరించనుంది. 50 శాతం నిధుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వనుందని అధికారులు చెబుతున్నారు.

ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టండి

అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వివరాలు పంపించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖలను సైతం పంపించింది. ప్రాజెక్టు స్టేటస్, ప్రాజెక్టు ఫీచర్స్, ఫిజికల్, ఫైనాన్సియల్ ప్రోగ్రెస్, ప్రాజెక్టు వ్యయం, కాన్సెప్ట్ ప్లాన్, డీపీఆర్, టెండర్ డాక్యుమెంట్, వర్క్ ఆర్డర్, ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ, పూర్తి చేయనున్న అంచనా తేదీలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించింది. ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకోవడం, యూజర్ చార్జీలు, అడ్వర్టైజ్‌మెంట్ చార్జీలు, సేల్ ఆఫ్ రీయూజ్ వాటర్, ఎనర్జీ వంటి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటే ప్రోత్సాహకంగా కేంద్రం నిధులు ఇవ్వనుంది.

గతేడాది ‘ఫండ్’లోనే కోత

రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదనే విమర్శలూ లేకపోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రబడ్జెట్‌లో నేరుగా నిధులు కేటాయించకపోయినా.. అర్బన్ చాలెంజ్ ఫండ్ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే గతేడాది రూ.1.5 లక్షల కోట్ల ఫండ్‌లోనే నిధులు రాలేదని, ఈసారి రూ.లక్ష కోట్ల నుంచి రాష్ట్రానికి ఏమైనా నిధులు వస్తాయా? లేదా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలోని సీడీఎంఏ, పబ్లిక్ హెల్త్ విభాగం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రోరైలు ప్రాజెక్టు, జలమండలి, కులీకుతూబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ విభాగాల నుంచి ప్రతిపాదనలు పంపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ తయారుచేసే ప్రాజెక్టు ప్రతిపాదనలూ పంపించారు. జలమండలి పరిధిలో రూ.17,212 కోట్లలో సీవరేజ్ మాస్టర్ ప్లాన్, ఎస్టీపీల ఏర్పాటు వంటి ప్రాజెక్టు డీపీఆర్ అందజేశారు. హెచ్ఎండీఏ పరిధిలో రెండు ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు ప్రతిపాదనలు పంపించారు. మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టును సైతం యూసీఎఫ్‌లోనే చేర్చారు. ఇక సీడీఎంఏ పరిధిలోని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, శానిటేషన్, మురుగునీటి ప్రాజెక్టులకు సైతం యూసీఎఫ్ నుంచి నిధులు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించిన విషయం తెలిసిందే.

సంస్కరణలు అమలు చేస్తేనే నిధులు

పట్టణాల్లో సంస్కరణలు అమలు చేస్తేనే యూసీఎఫ్ నిధులు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, ఆర్థిక సంస్కరణలు, పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలు, పట్టణ ప్రణాళికల్లో సంస్కరణలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రైవేట్ సంస్థల పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సంస్కరణలు పూర్తిస్థాయిలో అమలు చేసిన పట్టణాభివృద్ధి శాఖలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో వెల్లడించింది.

Next Story