కులగణనపై కేంద్ర నిర్ణయం రాహుల్ విజయం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 08:08:22  IST  )

కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కులగణనపై కేంద్ర నిర్ణయం రాహుల్ విజయం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ఉన్న కులగణన డిమాండ్‌పై రాహుల్ గాంధీ గొంతెత్తారని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేస్తామని మాటిచ్చి.. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి కూడా పంపామని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కులగణన బిల్లు ఆమోదం కోసం ఆందోళన చేశామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను ఆదర్శంగా తీసుకుని.. కేంద్రం దేశ వ్యాప్తంగా జన గణనతో పాటుగా కులగణన‌ను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.

దేశ వ్యాప్త కులగణనకు కమిటీ వేయాలి..

దేశ వ్యాప్త కులగణన కోసం కేంద్ర మంత్రులతో ఓ కమిటీని వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం అధికారులు, నిపుణులతో కమిటీ వేసి ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రానికి సూచించారు. కులగణన చేసే ముందు వచ్చే సవాళ్లపై అన్ని రాష్ట్రాలపై మాట్లాడాలని అన్నారు. పార్టీలు, ప్రజా సంఘాలతో నిపుణుల కమిటీ విస్తృతంగా చర్చించాలని డిమాండ్ చేశారు. కులగణన విధివిధానాలు కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని అని అన్నారు. రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్లి కులగణన సర్వేలో అభిప్రాయాలు సేకరించామని అన్నారు. ఆ డేటాను గోప్యంగా ఉంచామని అన్నారు. ఆటంకాలు ఎదురైనా వెరువక కేవలం మూడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు. నేడు కులగణనకు తెలంగాణ మోడల్ ఊపయోగపడుతోందని సీఎం అన్నారు.

కులగణన ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి..

కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిదని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఆ ప్రక్రియను ఎప్పుడు మొదలుపెట్టి.. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాము దేశ వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేంద్ర కులగణను మాకంటే ఉత్తమంగా సర్వే చేపడితే సంతోషమేనని అన్నారు. ఆస్తుల విషయంలో జనం అబద్ధాలు చెప్పవచ్చేమో కానీ.. కులం విషయంలో ఎవరూ అని పని చేయాలేరని అన్నారు. ఏ డేటా అందుబాటులో లేని పక్షంలో కేంద్ర లెక్కలే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. వందేళ్ల భారతదేశ చరిత్రలో ఎవరూ చేయని కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అలా జరిగి ఉంటే.. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేసేదే..

బీజేపీ 240 సీట్లకే పరిమతమైనందున రిజర్వేషన్లు రద్దు కాలేదని కామెంట్ చేశారు. ఒకవేళ ఆ పార్టీకే మెజారిటీ వచ్చి ఉంటే రిజర్వేషన్లను నిర్ధాక్షిణ్యంగా ఎత్తేసే వారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. కులగణనపై నివేదిక తయారయ్యాక బలహీన వర్గాలు, నిరుపేదలకు లబ్ధి జరగాలని.. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. అలస్యమైనా కేంద్రం మంచి నిర్ణయం తీసుకోవాడాన్ని తాము స్వాగతిస్తుమని అన్నారు. కులగణన విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని.. జనాభా లెక్కలను 2021 నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారని కామెంట్ చేశారు. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

Next Story