ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం అనుమతి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అల్లోపతి డాక్టర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 09:16:18  IST  )

ఆయుర్వేదంలో ఆపరేషన్లకు ఇటీవల కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయమై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం అనుమతి.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అల్లోపతి డాక్టర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుర్వేదంలో ఆపరేషన్లకు ఇటీవల కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయమై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమ్మతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నైపుణ్య శిక్షణ పూర్తిచేసుకున్న ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను స్వతంత్రంగా చేసే వెసులుబాటు కల్పిస్తూ ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేంది. ఈ నేపథ్యంలో పలువురి నుంచి అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారతీయ కేంద్ర వైద్యమండలి(సీసీఐఎం) 2020 నవంబర్ 20న జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా 39 శల్యతంత్ర(హెర్నియా, వేరికోస్ వీన్స్, హైడ్రోసీల్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా తదితర సాధారణ శస్త్రచికిత్సలు), 19 శలాక్యతంత్ర(ఈఎన్‌టీ, నేత్ర, దంత వంటి ఇతర విభాగాల) శస్త్రచికిత్సల నిర్వహణకు ఆయుర్వేద పీజీలకు కోర్సుల సమయంలో అధికారిక శిక్షణ ఇస్తారు. అర్హత పొందిన ఆయుర్వేద పీజీ డాక్టర్లకు స్వతంత్రంగా సర్జరీలు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. తాజా నిర్ణయంలో భాగంగా ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, ఆ రాష్ట్ర ఆయుష్‌ సంచాలకుడు దినేశ్ కుమార్‌ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో శల్య, శలాక్య తంత్ర పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని, ఆపరేషన్‌ థియేటర్లు, శస్త్రచికిత్స వంటి పరికరాలను సమకూర్చాలని ఆదేశించారు. పీజీ వైద్య విద్యార్థులకు సర్జరీలపై అవగాహన కల్పించేలా నాణ్యమైన విద్యతో కూడిన కోర్సులు నిర్వహించాలని సూచించారు.

భారతీయ వైద్యానికి పెద్దపీట

పురాతన భారతీయ వైద్య విధాన ప్రక్రియను ఆధునిక చికిత్స విధానంతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు భావిస్తున్నది. కాగా, ఆయుష్ వైద్యానికి బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ముందు నుంచీ సానుకూలంగా ఉంది. ఆయుర్వేదానికి ఊపిరులూదేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోంది. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో అంత చొరవ చూపడం లేదని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో 58 రకాల శస్త్రచికిత్సలు ఆయుర్వేద వైద్యులు చేయొచ్చని తీసుకొచ్చిన జీవో తమకు కొత్త ఉత్సాహం ఇచ్చిందని హైదరాబాద్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ జయకృష్ణ ‘దిశ’కు వెల్లడించారు.

శస్త్ర చికిత్సలపై భిన్నస్వరాలు

ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలు చేయొచ్చని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఆయుష్ శస్త్రచికిత్సలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ పనులు, సేవలు, సరఫరాల కాంట్రాక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, సిబ్బంది, స్థానిక సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తప్పనిసరి చేస్తారని తాము ఆశిస్తున్నామని తెలిపారు. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆయుర్వేద వైద్యులు ఆధునిక శస్త్రచికిత్సలు చేయడం ద్వారా రోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఇది ‘మిక్సోపతి’ని ప్రోత్సహిస్తుందని, క్వాకరీని చట్టబద్ధం చేస్తుందని ఐఎంఏ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ మాదాల హెచ్చరించారు. అల్లోపతి వైద్యులు ఏళ్ల తరబడి ఆధునిక వైద్యశిక్షణ పొందుతారని, ఆయుర్వేద వైద్యుల శిక్షణ భిన్నమైందని, ఇలాంటి మిశ్రమ చికిత్సలు రోగుల ప్రాణాలతో ఆటలాడటమే అవుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా సంక్లిష్ట శస్త్రచికిత్సల్లో అనుభవం లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇది వైద్య వ్యవస్థల మధ్య విభేదాలను పెంచుతుందని అల్లోపతి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం ఏం చెబుతోంది?

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నది. 2020లో సీసీఐఎం(ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్) జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆయుర్వేద పీజీ వైద్యులు నిర్దిష్ట శస్త్రచికిత్సలకు శిక్షణ పొంది స్వతంత్రంగా చేయొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పురాతన భారతీయ వైద్య వ్యవస్థలను ఆధునిక వైద్యంతో అనుసంధానం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మెరుగుపర్చడానికి దోహదపడుతుందని కేంద్రం భావిస్తున్నది. 2025 చివరి సమీక్షలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదాన్ని ఎవిడెన్స్ బేస్డ్ వైద్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.

ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి?

ఈ నోటిఫికేషన్‌ను అమలుచేసిన వాటిలో మహారాష్ట్ర(2021 నుంచి), కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు వంటివి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యులు నిర్దిష్ట శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయితే ఐఎంఏ వ్యతిరేకతల మధ్య కొన్ని రాష్ట్రాలు ఇంకా పూర్తిగా అమలుచేయలేదు. సుప్రీంకోర్టు 2023లో ఆయుర్వేద వైద్యులు సంక్లిష్ట శస్త్రచికిత్సల్లో సహాయం చేయలేదని, ఎంబీబీఎస్ డాక్టర్లతో సమాన వేతనం లేదని తీర్పు ఇచ్చింది. కానీ మూల నోటిఫికేషన్‌ను రద్దు చేయలేదు. 2025లో ఏపీ తాజా రాష్ట్రంగా ఈ అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు చేసే సర్జరీలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Read More..

యాంటీ ఏజింగ్ సీక్రెట్స్.. వీటిని ఫాలో అయితే మీ వయసెంతో ఎవరూ చెప్పలేరు!

Next Story