Musi project: మూసీ ప్రాజెక్టులో కీలక పరిణామం.. చెట్ల నరికివేతపై NHRC కేసు నమోదు

by Prasad Jukanti |

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో పర్యావరణ విధ్వంసంపై హెన్‍హెచ్ఆర్‍సీలో కేసు నమోదైంది.

Musi project: మూసీ ప్రాజెక్టులో కీలక పరిణామం.. చెట్ల నరికివేతపై NHRC కేసు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మూసీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై (Musi Riverfront Project) జాతీయ మానవ హక్కుల కమిషన్‍ (NHRC)లో కేసు నమోదు అయింది. మూసీ ప్రాజెక్టు పేరుతో ఈ నది తీర ప్రాంతాల్లో విపరీతమైన పర్యావరణ విధ్వంసం జరుగుతోందని దీన్ని అడ్డకోవాలని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని హెన్ఎచ్‍ఆర్‍సీని ఆశ్రయించారు. ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండా లంగర్ హౌస్, నార్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో శతాబ్దాల నాటి వేలాది చెట్లను నరికివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావంపై ఎటువంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ నిర్వహించకుండా పనులు ప్రారంభించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.

చెట్ల నరికివేతను నిలిపివేయించండి:

ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా మూసీ తీరాలను ధ్వంసం చేస్తున్నారని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Musi River Development Corporation Limited) మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వి. నరసింహా రెడ్డికి చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని, పర్యావరణానికి హానికరమైన పనులను ఆపేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేయాలని రామారావు ఇమ్మనేని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న హెన్ఎచ్‍ఆర్‍సీ (National Human Rights Commission) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని మూసీ తీరాల రక్షణకు చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని రామారావు ఇమ్మనేని స్పష్టం చేశారు.

Next Story