Telangana BSP : 42% బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీఎస్పీ మద్ద‌తు

by Ramesh Naini |

42% బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీఎస్పీ సంపూర్ణ మద్ద‌తు ఇస్తోంది. వెంట‌నే చ‌ట్టం చేసి అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది.

Telangana BSP : 42% బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీఎస్పీ మద్ద‌తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 42% బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీఎస్పీ (BSP) సంపూర్ణ మద్ద‌తు ఇస్తోంది. వెంట‌నే చ‌ట్టం చేసి అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా నూతనంగా ఎన్నికైన ఇబ్రాం శేఖ‌ర్ సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ (BC reservations) పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న‌ డ్రామాల‌ను బీఎస్పీ ఖండిస్తోందన్నారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ ప్ర‌తిసారి ఈ డ్రామా న‌డుస్తోంది త‌ప్పితే.. చ‌ట్టం రావ‌డం లేదన్నారు. బీసీలు ఇక్క‌డో విష‌యం గ‌మ‌నించాలి.. ఎలాంటి రిజ‌ర్వేష‌న్లు లేకుండా అగ్ర‌కులాల‌కు 70 శాతం టికెట్లు ఇస్తున్న‌ప్పుడు.. బీసీల‌కు టికెట్లు ఇవ్వడానికి మాత్రం ఎందుకు చ‌ట్టం కావాలంటున్నారు? బీసీల ప‌ట్ల క‌ప‌ట ప్రేమ‌ ఇక్క‌డే అర్థం అవుతోందని పేర్కొన్నారు.

ఎలాంటి చ‌ట్టం అవ‌స‌రం లేకుండా 1984 నుంచే బీసీల‌కు 50 శాతం టికెట్లు (Bahujan Samaj Party) బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ ఇస్తోందని తెలిపారు. దేశంలో ఒక్క బీఎస్పీ మాత్ర‌మే స‌ర్పంచ్ నుంచి లోక్‌స‌భ వ‌ర‌కు బీసీల‌కు 50 శాతం టికెట్లు ఇచ్చి, వారిని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిస్తోందన్నారు. ముస్లిం స‌మాజానికి వారి జ‌నాభా ప్ర‌కారం టికెట్లు ఇస్తోందని, ఎవ‌రి జ‌నాభా ఎంతో వారి వాటా అంత అన్న నినాదంతో బీఎస్పీ ఏర్పడిందని, అందుకు అనుగుణంగా ప‌ని చేస్తోందన్నారు. మిగ‌తా పార్టీలు బీఎస్పీని కాపీ కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ బీసీలు, ముస్లింలు ముందుకు వ‌చ్చి త‌మ‌కు స‌మాన స్థాయిలో నిల‌బ‌డ‌తామంటే అగ్ర‌కుల పార్టీల మ‌న‌సు అంగీక‌రించ‌డం లేదని, అందుకే బీసీ రిజ‌ర్వేష‌న్లు చ‌ట్టం కావ‌డం లేదన్నారు.

Next Story