- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండునెలల పసిగుడ్డు ఏం చేసిందని చంపేశారు? : కేటీఆర్ ధ్వజం
కుమ్మెర మల్లన్న జాతరలో రెండునెలల పసిప్రాణాన్ని బలిగొనడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. హంతకుడిని నిష్పక్షపాతంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హత్యారాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండునెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారని ప్రశ్నించారు. మాటలకు, ఊహలకు అందని మహావిషాదమని, కుమ్మెర జాతరలో జరిగిన ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. మానవత్వానికి మాయని మచ్చ ఇది అని, దీనిపై రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ పోరాడుతామని తెలిపారు. పసిపాప ప్రాణాలను బలిగొన్న హంతకులకు ఎవరూ అండగా నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నారి, తల్లిదండ్రులపై ఇష్టానుసారంగా దాడిచేసి, కులంపేరుతో దూషించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కోటిరూపాయల పరిహారం..
ఈ ఘటనలో పోలీసులు బాధిత కుటుంబానికి అండగా నిలవకపోవడం హేయమైన చర్య అన్నారు. హంతకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించడం ఆ వ్యవస్థకే సిగ్గుచేటని విమర్శించారు. మనం ఎంత అభివృద్ధి చెందిన సమాజంలో ఉన్నా.. నేటికీ కులంపేరుతో దాడులు చేస్తుండటం దారుణమన్నారు. ఆ రెండేళ్ల చిన్నారికి కులం తెలుసా ? మతం తెలుసా? ఏం తెలుసని నిండు జీవితాన్ని చిదిమేశారంటూ ఫైరయ్యారు. హంతకుడు ఏ పార్టీకి చెందినవాడైనా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్నారి మరణానికి కారణమైన 8 మందినీ వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.






