తెలంగాణకే అవమానం.. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి : కేటీఆర్ సంచలన డిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-24 06:17:21  IST  )

ఈడీ ఛార్జిషీటులో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

తెలంగాణకే అవమానం.. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి : కేటీఆర్ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడీ ఛార్జిషీటులో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు (National Herald Money Landering Case)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు..మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ (Bag Man) అనే పేరొచ్చిందన్నారు. యంగ్ ఇండియా (Young India) పేరుతో వసూళ్లకు పాల్పడి రూ.50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నట్లు కాంగ్రెస్ వాళ్లే చెప్తున్నారన్నారు. నాలుగుకోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహించే పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి, ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

కేవలం 16-17 నెలల్లో 44సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సాధించారన్నారు. రేవంత్ అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడానికి కారణం తమకు కూడా ఇప్పుడే అర్థమైందని, నన్ను అరెస్ట్ చేయకండి అని చీకట్లో ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని, నాపై కేసులు వేయకండి అని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా తెలంగాణలో లక్ష 80వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారో, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను దోచి, ఏటీఎంగా మార్చి.. ఢిల్లీ బాసులకు అప్పజెప్తున్నారన్నారు.

ఏడాదిన్నరకాలంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసిన పనులు.. బీఆర్ఎస్ (BRS) పై నిందలు వేయడం, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేలకోట్ల రూపాయల చందాలు పంపడమేనని విమర్శించారు. ప్రతి విషయంలో మాట్లాడే రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ కూడా ఈ విషయంపై స్పందించకుండా జపాన్ కు వెళ్లారని, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే నాడు జపాన్ కు వెళ్లొచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో యడియూరప్ప కూడా తన పేరు రావడంతో పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడంపై కాంగ్రెస్ ఆలోచించాలని, కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, అది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు.

ఇక మంత్రి పొంగులేటి (Minister Ponguleti) ఇంటిపై జరిగిన దాడులపై మాట్లాడిన కేటీఆర్.. 2024 సెప్టెంబర్ లో మంత్రి పొంగులేటి నివాసంలో రెయిడ్ జరగ్గా.. ఇప్పటి వరకూ దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ మంత్రుల్ని కాపాడేందుకు బీజేపీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కు సంబంధించి తెలంగాణకు రూ.45 కోట్లు వచ్చినా కాంగ్రెస్ నేతల పేర్లు కూడా బయటికి రానివ్వలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వలేదన్నారు. కర్ణాటక రిమాండ్ డైరీలో వాల్మీకి కుంభకోణం గురించి రాసిన ఈడీ.. ఇక్కడ మాత్రం మాట మాట్లాడట్లేదని, ఇదంతా ఒక బ్రహ్మ రహస్యంగా ఉందన్నారు.

సివిల్ సప్లై స్కామ్ (Civil Supply Scam)ను బయటపెట్టినా.. దానిపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India), కేంద్ర ప్రభుత్వం, ఏ ఏజెన్సీ కూడా స్పందించకపోవడం గమనార్హం. అమృత్ స్కామ్ (Amrit Scam)లో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1135 కోట్ల వర్క్ ఇచ్చారని ఆరోపించామని, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manoharlal Khattar)కు వివరంగా చెప్పినా ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదన్నారు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కామ్ లపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారని గ్రహించాలని సూచించారు.

Next Story