- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిల్ట్ పాలసీ వివాదం.. పోరుబాటకు సిద్ధమైన బీఆర్ఎస్
హిల్ట్ వలన రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టంపై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయబోతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ (HILTP) పై రాజకీయ వివాదం తగ్గడం లేదు. హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ (BRS) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిల్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో కూడిన 8 నిజనిర్దారణ కమిటీలను (Fact Finding Committee) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా నియమించారు. ఈ బృందాలు రేపు, ఎల్లుండి హిల్ట్ పరిధిలోకి వచ్చే పారిశ్రామిక వాడల్లో పర్యటించి ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించనున్నారు.
కేటీఆర్ దిశానిర్దేశం:
హిల్ట్ భూముల వ్యవహారంలో ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీలను ఏర్పాటు చేసిన కేటీఆర్ ఈ సందర్భంగా కమిటీలలోని నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.5 లక్షల కోట్ల కుంభకోణం నిజా నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని సూచించారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ (SRO) రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
నిజనిర్ధారణ బృందాల పర్యటన వివరాలు:
క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు.
క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
క్లస్టర్-3కు సంబంధించి మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రవీందర్ రావు మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు.
క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు.
క్లస్టర్-6లో చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు.
క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి కాటేదాన్, హయత్ నగర్‍లో పర్యటిస్తారు.
క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీం చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శిస్తారు.






