Open Letter: మా మనోభావాలను పట్టించుకోండి.. కేటీఆర్‌కు BRS కార్యకర్తల సంచలన లేఖ!

by Ramesh Naini |   (  Updated:2025-07-06 11:41:44  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు ఆ పార్టీ కార్యకర్తలు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ బహిరంగ లేఖ చక్కర్లు కొడుతోంది.

Open Letter: మా మనోభావాలను పట్టించుకోండి.. కేటీఆర్‌కు BRS కార్యకర్తల సంచలన లేఖ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు ఆ పార్టీ కార్యకర్తలు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ సంచలన బహిరంగ లేఖ (open letter) చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణకు శ్రీరామ‌రక్ష కేసీఆర్ @AlwaysTelangana అనే యూజర్ బీఆర్ఎస్ కార్యకర్తల పేరుతో లేఖను పోస్ట్ చేశారు. నవంబర్ 29, 2009 న, కేసీఆర్ (KCR) దీక్ష వల్ల, తెలంగాణ ఉద్యమం ఒక పతాక స్థాయికి చేరుకుందని లేఖలో పేర్కొన్నారు. 2009 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ బిడ్డల బలిదానాలకు, కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో.. ఆంధ్రా మీడియా కూడా అంతే కారణం అని ఆరోపించారు. “కేసీఆర్ లొంగిపోయాడు”, “తెలంగాణ రాదు”, “అసలు తెలంగాణ వచ్చే అవకాశం లేదు” అంటూ ఉద్యమకారుల ఆత్మవిశ్వాసం దెబ్బ తినేలా నాడు ఆంధ్ర మీడియా రాతలు రాసిందని పేర్కొన్నారు.

ఆంధ్రా మీడియాలో ఓ ప్రముఖ మీడియా చానల్ (ఏబీఎన్) ఒక ప్రత్యేక స్థానం.. వారు రాసిన విషపు రాతల వల్ల “తెలంగాణ రాదు” అనే భయంతో కొన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులయ్యారు.. అని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ మీరు 2014 నుండి 2023 వరకు ఆ ఆంధ్రా ఛానల్‌ను పట్టించుకోకుండా ఒదిలేసి చాలా పెద్ద తప్పు చేశారని తెలిపారు. తెలంగాణ మీద, కేసీఆర్ మీద, ఆయన కుటుంబంపై ఆ ఛానల్ రాసిన విషపు రాతలు చూస్తే మా బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు బద్దలవుతాయి.. అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలను మీరు పట్టించుకుని, ఆ ప్రముఖ ఆంధ్రా ఛానల్, దాని న్యూస్ పేపర్‌ను “తెలంగాణ ద్రోహి మీడియా” గా బహిష్కరించాలని పిలుపునివ్వాలని సూచించారు.

2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే, ఆ ప్రముఖ ఆంధ్రా పేపర్ రాసిన విషపు రాతల మీద చట్టపరమైన విచారణ ప్రారంభించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఏబీఎన్ ఛానల్ ఇంటర్వ్యూలకు వెళ్లకూడదు.. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా వదిలేస్తే, అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయి.. అని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒక్కటే కాదు, కేసీఆర్ పేరును, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే బాధ్యత కూడా బీఆర్ఎస్ నాయకుల మీద ఉందని లేఖలో పేర్కొన్నారు.

Next Story