బీఆర్ఎస్ ‘సోషల్’ వార్.. వారియర్స్‌ను సిద్ధం చేస్తున్న పార్టీ

by Disha Web Desk 12 |
బీఆర్ఎస్ ‘సోషల్’ వార్.. వారియర్స్‌ను సిద్ధం చేస్తున్న పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్స్‌ను సన్నద్ధం చేస్తున్నది. నియోజకవర్గానికి ఐదు వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా వివరించాలో వివరిస్తున్నది. అంతేకాకుండా విపక్షాల ట్రాప్‌లో పడకుండా వారు చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేలా సోషల్ వారియర్స్‌ను రెడీ చేస్తున్నారు.

గ్రామాల వారీగా కమిటీలు

బీఆర్ఎస్ ఇప్పటికే గ్రామాల వారీగా సోషల్ మీడియా కమిటీలను నియమించింది. మొదట్లో వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తామని చెప్పినప్పటికీ జాప్యం జరిగింది. అయితే ఎలక్షన్స్ కు ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. సెగ్మెంట్ లో వారియర్స్ గా ఐదు వేల మందిని ఎంపిక చేయగా, 500 మంది చొప్పున విడతల వారీగా ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. పోస్టులను ఎలా రాయాలి? సందర్భానుసారంగా ఎలా పోస్ట్ చేయాలి అనే వాటిని నేర్పిస్తున్నారు.

ప్రతిపక్షాల ట్రాప్ లో పడకుండా..

క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ డిజిటల్ మీడియా నుంచి వచ్చే అభివృద్ధి, సంక్షేమ వివరాలను అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని భావిస్తున్నారు. విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగకుండా, ఎవరిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా అభివృద్ధి, సంక్షేమంపై గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టేలా కేడర్‌కు సైతం గ్రామాలవారీగా ఏర్పాటుచేసి, వాట్సాప్ వేదికగా సూచనలు చేయనున్నారు. నియోజకవర్గంలో చేసిన, గ్రామాల వారీగా అభివృద్ధి పనులను వీడియోలు, కంటెంట్ రూపంలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు.

అభివృద్ధిని పోల్చుతూ..

గతంలో టీడీపీ, కాంగ్రెస్ చేసిన పనులు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అభివృద్ధిని పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వివరించనున్నారు. 14 ఏళ్లపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం, తెలంగాణ ఆవిర్భవించిన తీరును వివరించే ప్లాన్ చేస్తున్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు, ధరణిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. గ్రామాల్లో వీడియోల రూపంలో వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలపై విశ్లేషణాత్మక విమర్శలకు కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది.

Next Story